Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభ
- కోవిడ్-19 నిబంధనలకనుగుణంగా నిర్వహణ
- షర్మిలతో పాటు విజయమ్మ, బ్రదర్ అనిల్ రాక
- రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి వెల్లడి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సంకల్ప సభ శుక్రవారం ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు షర్మిల స్థాపించే పార్టీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. షర్మిల బీజేపీ, టీఆర్ఎస్లు వదిలిన బాణం కాదని ఆమె తెలంగాణ ప్రజల బాణమని వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ అనుమతి ప్రకారం కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సభ నిర్వహిస్తామన్నారు. గ్రౌండ్‌లోపలికి ఆరువేల మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని, తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని చూడాలని, అది షర్మిలతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 8 గంటలకు విజయమ్మతో కలిసి షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్ బయలుదేరుతారని తెలిపారు. మార్గంమధ్యలో ఆయా ప్రాంతాల్లో అభిమానులు ఆమెకు స్వాగతం పలుకుతారన్నారు. హయత్‌నగర్ మొదలు ఖమ్మం వరకు ఆమెకు స్వాగతం పలికేందుకు అభిమానులు హైదరాబాద్ నుంచి ఖమ్మం రోడ్డుమార్గం పొడవునా ఉత్సుకతతో ఉన్నట్లు చెప్పారు. ఈ సభలో షర్మిల తెలంగాణ సమస్యలు, టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై వివరిస్తారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులతో షర్మిల సమావేశాలు నిర్వహించారన్నారు. ఆయా ప్రాంత సమస్యలపై అధ్యయనం చేశారని తెలిపారు. వీటన్నింటితో పాటు తాను ఏ ఆశయం కోసమైతే ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారో ఈ సంకల్ప సభలో వివరిస్తారని తెలిపారు. ఈ సభ కోసం వైఎస్ఆర్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో కదలిరానున్నట్లు తెలిపారు. అయితే ఈ సభలో పార్టీ పేరు ప్రకటన ఉండదన్నారు. జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మరో సభలో పార్టీ పేరు, జెండా , ఎజెండా... విధివిధానాలు స్పష్టమవుతాయన్నారు. ఈ సమావేశంలో షర్మిల పార్టీ నాయకులు లక్కినేని సుధీర్, టీ.కె.. మోహన్, శీలం వెంకటరెడ్డి, అంజన్‌రావు, రోశిరెడ్డి, తుమ్మా అప్పిరెడ్డి, జిల్లేపల్లి సైదులు పాల్గొన్నారు.