Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
విద్యాసంస్థలను ప్రారంభించాలని, ప్రయివేటు టీచర్లు, లెక్చరర్స్, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సీపీఐ(ఎంఎల్ ఎన్డి) జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ప్రయివేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు అమర్, బండారు రవికుమార్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్‌లు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన గత సంవత్సర కాలం నుండి ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయన్నారు. ఈ విద్యా సంస్థలలో పనిచేస్తున్న లక్షలాది ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది వేతనాలు అందక తీవ్రంగా నష్టపోయారన్నారు. ఉన్నత చదువు చదివి, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీరు ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకోవడం కోసం కూరగాయలు అమ్ముకోవడం, రోడ్డు పక్కన చిన్న చిన్న వస్తువులు అమ్ముకోవడం, గ్రామీణ ప్రాంతాలలో కూలి పనులకు వెళ్ళడం జరుగుతోందన్నారు. కొంతమంది ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ ఆత్మగౌరవాన్ని చంపుకొని, ఇతర వృత్తులు చేయలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో భవిష్యత్ తరాలను తయారుచేసే ఉన్నత విద్యావంతులైన ప్రైవేటు టీచర్స్‌ను, లెక్చరర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.. వారికి కరోనా ప్యాకేజీని ప్రకటించి నెలకు 10 వేల రూ.లకు తగ్గకుండా కనీసం సంవత్సర కాలం పాటు వీరికి అందించి ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. అలాగే మన రాష్ట్ర విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో నష్టపోకుండా, కరోనా జాగ్రత్తలను పాటిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బడ్జెట్ పాఠశాలలను, కళాశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.