Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారులకు ఎన్పీడీసీఎల్ 'షాక్'
- రూ.500లోపు వచ్చే ఇంటికి రూ.4వేల పైన వడ్డన
- డెవలప్మెంట్, కన్జూమర్ డిపాజిట్ పేరుతో అదనపు బాదుడు
- ఇప్పటికే 15వేల మందికి పైగా మోత..కొనసాగనున్న వాయింపు
- కరోనా కష్ట సమయంలో అదనపు భారంపై బాధితుల గగ్గోలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సరఫరాతో పాటు వినియోగదారులకు 'షాక్'లు ఇవ్వడంలో విద్యుత్ సంస్థలు ఆరితేరాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా... విద్యుత్ బిల్లులను పది ఇరువై రెట్లు అమాంతం పెంచి షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. పెరిగిన విద్యుత్ బిల్లుకు కారణం తెలుసుకుని...మరుసటి నెలైనా జాగ్రత్త పడేందుకు పలువురు వినియోగదారులు విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదని వాపోతున్నారు. అధిక లోడ్ పేరుతో అధికంగా వడ్డిస్తున్నారు. ఒక ఇంట్లో క్రితం నెల వినియోగించిన విద్యుత్ పరికరాలనే మరుసటి నెల కూడా వినియోగించినా...బిల్లుల్లో భారీ వ్యత్యాసం వస్తుండటం గమనార్హం. వినియోగించిన అదనపు యూనిట్లకు టారిఫ్ ఆధారంగా అదనం బిల్లు చెల్లించాలనే ధ్యాసలో విద్యుత్ వినియోగదారులు ఉంటారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించిన అదనపు కరెంట్‌కు యూనిట్లు లెక్కించి టారిఫ్ ప్రకారం బిల్లు విధించాలి. కానీ లోడ్ పేరుతో వేలకు వేలు భారం వేస్తుండటంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నవంబర్ నుంచి కొనసాగుతున్న ఈ వడ్డన భారం ఇప్పటికీ 15వేల మందికి పైగా వినియోగదారులపై పడింది. భవిష్యత్‌లోనూ కొనసాగనుంది. ప్రతి బిల్లుపైనా డెవలప్మెంట్ చార్జి, కన్జూమర్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో అదనంగా వడ్డిస్తున్నారు. విద్యుత్ వినియోగానికి వందల్లో బిల్లు వస్తే...కన్జూమర్ డిపాజిట్ చార్జి వేలల్లో ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు.
అదనపు 'షాక్'
వేసవిలో అధిక కరెంట్ వినియోగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్పీడీసీఎల్ కమర్షియల్ విభాగం బిల్లుల భారం మోపుతోంది. వినియోగదారులు కొంత డిపాజిట్ చెల్లించి కరెంట్ మీటర్ తీసుకుంటారు. వినియోగించిన యూనిట్ల ఆధారంగా బిల్లులు వస్తాయి. వాడకం పెరిగితే యూనిట్లు పెరుగుతాయి. దాని ప్రకారం బిల్లులు రావాలి. కానీ గతకొంత కాలంగా బిల్లుపై డెవలప్మెంట్ చార్జి, కన్జూమర్ డిపాజిట్ చార్జి పేరుతో వేలాది రూపాయల బిల్లులు వేస్తుండటంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. ఈ విషయంలో అద్దె ఇళ్లలో ఉండేవారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటి అద్దెకంటే కరెంట్ బిల్లు అధికంగా వస్తుండటంతో పలువురు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. జిల్లాలో 5.45 లక్షల కనెక్షన్లుండగా వీటిలో లోడింగ్ కలిపినవి 15,156 ఉన్నాయి. ఇంకా కలపాల్సినవీ ఉన్నాయి. ఎన్నికలు, ఆయా ప్రాంత రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లోడింగ్ చార్జీలు మోపుతూ ఉండాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎలా వడ్డిస్తారు...?
నగరానికి చెందిన వెన్నబోయిన శ్రీనివాస్ (సర్వీస్ నెం: 15467392) 196 యూనిట్ల విద్యుత్ వినియోగించుకున్నారు. దీనికి గాను ఆయనకు రూ.738 ఎనర్జీ చార్జీలు, కస్టమర్ చార్జి రూ.50 చొప్పున రూ.788 బిల్లు రావాలి. కానీ స్పెషల్ డిపాజిట్ కింద రూ.400, డెవలప్మెంట్ చార్జీల కింద రూ.2,832 చార్జి విధించి మొత్తం రూ.4,033 బిల్లు పంపారు. ఫిబ్రవరి నెల రూ.287 బిల్లు వచ్చిన ఆ వినియోగదారుడు మార్చినెల బిల్లు రూ.4,033 రావడంతో అవాక్కయ్యారు. బిల్లు కలెక్టర్, లైన్ ఇన్స్పెక్టర్ ఎవరూ దీనిపై సరిగా స్పందించక పోవడంతో ఏఈ ఆఫీసుకు వెళ్లి కారణం తెలుసుకున్నారు. 1 కిలోవాట్ లోడ్ అనుమతి ఉన్న శ్రీనివాస్ 2 కిలోవాట్ వాడకం చేస్తున్నారని సారాంశం. దీనిపై ముందస్తు సూచనలు చేయాలిగా అనే సదరు వినియోగదారుడు ప్రశ్నిస్తే బిల్లులో సూచించామనే సమాధానంతో సరిపుచ్చారు. ఇది ఒక శ్రీనివాస్ సమస్యే కాదు ఎంతో మంది వినియోగదారులు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సంస్థలిస్తున్న 'షాక్'లతో సతమతం అవుతున్నారు. కరోనా కష్టకాలంలో ఈ వడ్డనేంటని గగ్గోలు పెడుతున్నారు.
జిల్లాలో వివిధ కేటగిరీల కింద వినియోగదారులు
కేటగిరీ 1 : 4,58,572, కేటగిరీ 2: 4,05,660, కేటగిరీ 3: 3,468, కేటగిరీ 4: 400, కేటగిరీ 5: 1,02,960, వివిధ కేటగిరీల కింద మొత్తం: 6,22,446 మంది వినియోగదారులున్నారు. దీనిలో 3.98 లక్షల కనెక్షన్లు గృహ వినియోగం, కమర్షియల్ కింద 38,199, పారిశ్రామికంగా 2,251, కుటీర పరిశ్రమల కోసం 345, వ్యవసాయ కనెక్షన్లు 99,395, వీధి దీపాల కనెక్షన్లు 5,022, తాగునీటి కనెక్షన్లు 1,538, ఇతర కనెక్షన్లు 2,289, మొత్తం 5,47,000 కనెక్షన్లున్నాయి. వీటిలో జిల్లా మొత్తమ్మీద లోడింగ్ కలిపినవి 15,156 ఉన్నాయి. ఇంకా కలపాల్సినవీ ఉన్నాయి. భవిష్యత్‌లో మిగిలిన కనెక్షన్లకు ఇలాంటి వడ్డన తప్పదని విద్యుత్‌శాఖ అధికారుల మాటలను బట్టి తెలుస్తోంది.
అధిక లోడ్‌కు అదనపు భారం : శ్రీధర్, ఏఎస్వో
కన్జప్షన్కు సంబంధించిన నోటీసులు నవంబర్ నుంచే ఇస్తున్నాం. ఫిబ్రవరి బిల్లులో సూచించాం. అప్పుడు కట్టని వాళ్ల బిల్లులో మార్చి నెల నుంచే దాన్ని నెట్ అమౌంట్లో చేర్చుతున్నాం. ఒక సర్వీసు లోడ్ ఒక కిలోవాట్ ఉంటే రెండు మూడు కిలోవాట్స్, మూడు కిలోవాట్స్ ఉంటే నాలుగైదు కిలోవాట్స్ విద్యుత్ వినియోగిస్తున్నారు. అటువంటి వాటికి ఆర్ఎంబీ ప్రకారం అదనపు బిల్లు వస్తుంది. లోడ్ తగ్గించుకుని, ఏఈకి లెటర్ పెడితే బిల్లు తగ్గుతుంది. 1 కిలోవాట్‌కు 200% లోడ్ దాటిన వారికి మాత్రమే ఇలా అదనపు బిల్లు వస్తుంది. మీటర్‌పై బ్లాక్ బటన్ నొక్కితే లోడింగ్ తెలుస్తుంది. దాని ప్రకారం లోడింగ్ ఉంటే సరిపోతుంది. అదనంగా ఉంటే దానికి తగిన చార్జి చెల్లించి లోడింగ్ పెంచుకోవాలి.