Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ, ప్రభుత్వ రంగ పరిరక్షణకోసం ఉద్యమిద్దాం
- కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్
నవతెలంగాణ-ఖమ్మం
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతుల సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో ఈనెల 12న ఖమ్మంలో నీల్ దండు కవాత్ ను నిర్వహిస్తున్నట్లు, ఈ కవాత్లో సంఘ కార్యకర్తలు, సామాజిక, ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్ లోని సంఘం కార్యాలయంలో ఖమ్మం నగర కమిటీ సమావేశం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంట భీమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మనోహర్ పాల్గొని మాట్లాడుతూ ఏప్రిల్ నెలను మహనీయుల జయంతుల ఉత్సవాల మాసంగా నిర్వహించాలని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం పూలే అంబేద్కర్ ఆలోచనలను యువతీ యువకులకు చేరవేసే ప్రయత్నం కెవిపిఎస్ చేస్తుందన్నారు. అన్ని మండలాల నుండి ఏప్రిల్ 12న నీలి దండు కవాత్కు అధిక సంఖ్యలో పాల్గొనాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక, ప్రజా సంఘాలు యాత్రకు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం మరియు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్ల గొడుతున్నారని వారు విమర్శించారు. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయన్నారు. రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. మనువాదుల కుట్రలను అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ - ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని, మహనీయుల జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతి బా పూలే జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో కెవిపిఎస్ నగర నాయకులు వీరభద్రం, ప్రసాద్, చిరంజీవి, వెంకటకుమార్ పాల్గొన్నారు.