Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
పచ్చని కుటుంబంలో పంటకు చేసిన అప్పు చిచ్చుపెట్టింది. రూ. వేలాది ఖర్చు చేసి మిర్చి పంట వేస్తే కాయకొచ్చే దశలో మిర్చి తోట ఎండిపోయింది. చేసిన అప్పులు తీర్చే విషయమే భార్య భర్తల మధ్య తగాదులు ప్రారంభమైనాయి. మనస్తాపం తో భార్య పుట్టింటికెళ్ళగా దిక్కుతోచని స్ధితిలో భర్త పురుగుమందు తాగి ఆత్మహ త్యకు ఒడిగట్టిన ఘటన కారేపల్లి మండలం పేరుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరుపల్లికి చెందిన అజ్మీర రాములు(42) మూడు ఎకరాల మిర్చిపంట వేయగా దానికి వైరస్ సోకి ఎండి పోయింది. దానికి పెట్టుబడిగా రూ. 4లక్షలు బయట తెచ్చాడు. గతేడాది పంట కోసం చేసిన అప్పు రూ.3 లక్షలు తీరలేదు. మొత్తం అప్పు రూ.7లక్షలు. తీర్చే విషయమై భార్య పద్మతో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో పద్మ పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఒంటరిగా ఉన్న రాములు విరక్తి చెంది చేనువద్దకు వెళ్ళి అక్కడ ఉన్న పురుగుమందు సేవించాడు. దీనిని గమనించి చుట్టుపక్కల వారు అతనిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతునికి భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు హారిక, చిట్టి ఉన్నారు. తండ్రి మృతదేహంపై పడి చిన్నారులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతుని సోదరుడు లక్ష్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పీ.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.