Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయబ్రాంతులకు గురి చేస్తున్నారు : పోడు సాగుదారులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం అటవీ రేంజి పరిధిలోని తోగ్గూడెం అటవీ ప్రాంతంలో గిరిజనులు ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో పోలీస్ పహారా నడుమ అటవీ సిబ్బంది శుక్రవారం హరిత పనులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా పైడిగూడెం, తోగ్గూడెం గిరిజన గ్రామాల ప్రజలకు, అటవీ సిబ్బందికి మద్య పోడు భూముల విషయం వివాదంగా రాజుకుంటోంది. గిరిజనులు తాము ఏండ్ల తరబడి పోడు కొట్టి సాగు చేసుకుంటున్నామని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా హక్కు పత్రాలు ఇవ్వడం లేదని తమ వాదనను వినిపిస్తుండగా, అటవీ అధికారులు మాత్రం ప్రభుత్వ భూమి అని మీకు ఎమైనా ఆధారాలు ఉంటే చూపించాలని అడుగుతున్నారు. గత వారం రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు పోడు భూములను చదును చేయడం కోసం వెళ్లిన ట్రాక్టర్లను పోడు సాగు దారులు వెనక్కి తిప్పి పంపి వేశారు. ఫారెస్టు అధికారులు మాత్రం పోడు భూముల్లో హరిత మొక్కలు నాటడమే ద్యేయంగా సుమారు 10 డోజర్ ట్రాక్టర్లతో రేంజి అధికారి కనకరత్నం ఆధ్వర్యంలో 50 మంది ఫారెస్టు సిబ్బంది, ఎస్ఐ తిరుపతితో పాటు పోలీస్ సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడకు వెళ్లాయి. పనులు అడ్డు కోవడానికి వచ్చిన సాగు దారులను పోలీసులు ట్రాక్టర్ల ద్వారా పోలీస్ స్టేషన్కి తరలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. పోలీస్ సిబ్బంది వచ్చి మమ్ములను భూములనుండి వెళ్లగొట్టేందకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోడు సాగుదారులు నవతెలంగాణ ముందు వాపోయారు.