Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెండా, ఎజెండా అన్నీ ఆరోజే...
- బరాబర్ రాష్ట్ర ప్రజల కోసం నిలబడతా..
- తెలంగాణకు అన్యాయం జరిగే ఏ పనినైనా అడ్డుకుంటా..
- ఉద్యోగాల భర్తీకి 15 నుంచి నిరాహారదీక్షలు
- తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనకే పార్టీ
- ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల
- వైఎస్ఆర్ లాగే షర్మిలనూ ఆశీర్వదించండి: విజయమ్మ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వ పనితీరులేదు...మన ఆత్మగౌరవం దొరగారి ఎడుమకాలి చెప్పు కింద నలుగుతోంది. తెలంగాణ ప్రజల కోసం పోట్లాడుతా...అవకాశం ఇస్తే సేవ చేస్తా...లేదంటే ప్రజల తరఫున పోరాటం చేస్తా...మన పార్టీ ఏ పార్టీ కింద పనిచేయదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టేందుకు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, వైఎస్ఆర్ సంక్షేమ రాజ్య స్థాపనకు రాజన్న జయంతి రోజైన జూలై 8న మన పార్టీ ఆవిర్భవిస్తుంది. జెండా, ఎజెండా అన్నీ ఆరోజే ప్రకటిస్తాం' అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 'రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ' పేరిట ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన సభలో తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వచ్చి షర్మిల ప్రసంగించారు. నిధులు, నీళ్లు, నియామకాలంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబానికే ఇవన్నీ అన్నారు. నీళ్ల పేరిట నిధులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నియామకాలు కేసీఆర్ కుటుంబానికి మాత్రమేనన్నారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలన్న కేసీఆర్ ఏడేళ్లలోనూ అందులో సగం పోస్టులను కూడా భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటు న్నారన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫి ˜ికేషన్లు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 15న హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు తాను నిరాహారదీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో తమ పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేస్తారన్నారు. బరాబర్ తెలంగాణ ప్రజల కోసం నిలబడ తానన్నారు. అవకాశం ఇస్తే సేవ చేస్తా...లేదంటే వారి తరఫున పోరాటం చేస్తానన్నారు. టీఆర్ఎస్ చేబితేనో...బీజేపీ అడిగితేనో.. కాంగ్రెస్ పంపితేనో తాను ఇక్కడకు రాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధనకు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే వచ్చానన్నారు. తమ పార్టీ ఏ పార్టీ కింద పనిచేదని స్పష్టం చేశారు. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను తెలం గాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా...ఏ పనినైనా అడ్డుకుంటానన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీగానే ఉంటుందన్నారు. 'నేను ఒక్కతినే కాదు..మీరు నాకు తోడున్నారు.. మీకు నేను తోడున్నాను' అని షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. తాను ఇక్కడే పుట్టాను...ఇక్కడే పెరిగాను..ఇక్కడే చదువు కున్నాను...ఇక్కడి గాలే పీల్చాను...ఇక్కడే బిడ్డలను కన్నాను...అందుకే ఈ గడ్డ రుణం తీర్చుకోవాలను కుంటున్నాను. ఎవరన్నా... కాదన్నా బరాబర్ తెలంగాణలో నిలబడతానన్నారు. కేసీఆర్ నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్ ప్రశ్నించదన్నారు. బీజేపీ నోరెత్తితే మతం గురించే మాట్లాడుతుందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రానికి ఏమి చేశాయని ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
షర్మిలనూ ఆశీర్వదించండి: విజయ్మ
వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని తెలంగాణలో తీసుకురావాలనే లక్ష్యంతో షర్మిల ఇక్కడ పార్టీని స్థాపించాలని నిర్ణయిం చుకుందని...రాజన్నను ఆశీర్వదించినట్లుగానే షర్మిలనూ దీవించాలని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కోరారు. తెలంగాణ ప్రజలకండగా నిలబడతాను అని షర్మిల అన్నప్పుడు తాను ఎంతో సంతోషించానని తెలిపారు. వైఎస్ఆర్ కోసం 700 ప్రాణాలు కనుమూస్తే అందులో అత్యధికులు తెలంగాణ గడ్డవారేనని తెలిపారు. తెలంగాణ బిడ్డలందరికీ అండగా ఉంటానని ఫిబ్రవరి 9న షర్మిల అన్నప్పుడు ఎంతో సంతోషంగా అనుమతిచ్చానన్నాను. సభా వేదిక మీదకు రావడానికి ముందు విజయమ్మ, షర్మిల వైఎస్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సభలో రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, కొండా రాఘవరెడ్డి, లక్కినేని సుధీర్, నాగిరెడ్డి, ఏపూరి సోమన్న, కోమలి, కృష్ణమోహన్, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ గడిపల్లి కవిత, శీలం వెంకటరెడ్డి, రోశిరెడ్డి, జల్లేపల్లి సైదులు, నాడెం శాంతకుమార్, దేవేందర్‌రెడ్డి, కిషన్, పాల్గొన్నారు.