Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సంస్కరణలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దులలో రైతులు జరుపుతున్న ఉద్యమంకు మద్దతుగా శనివారం ఢల్లీీ - చండిగర్ జాతీయ రహదారిని పంజాబ్, హర్యానా రైతులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దిగ్బంధనం చేశారు. వేలాది మంది రైతులు జాతీయ రహదారిపై వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు పాల్గొన్నారు. జాతీయ రహదారి దిగ్బంధనం సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను ఎత్తివేసి, కార్పోరేట్ సంస్థలకు సులభంగా వ్యవసాయంలో పూర్తి స్థాయిలో ప్రవేశానికి అవసరమైన పరిస్థితులను కల్పించిందని అన్నారు. బహుళ జాతి కంపెనీలను భారత దేశ వ్యవసాయంలో ప్రవేశించటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు జరిపితే రైతులు, దేశ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడుతుందని, అందుకే రైతులు పాలకవర్గంపై భీకరమైన పోరు చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ పెద్దలు, మీడియాలోని కొన్ని సంస్థలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర కొన్ని రాష్ట్రాలలోని రైతులు మాత్రమే ఉద్యమం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ దేశంలో అన్ని రాష్ట్రాల రైతులు ఢల్లీీ సరిహద్దులలో రైతులు జరుపుతున్న ఉద్యమంకు మద్దతుగా స్థానికంగా ఉధతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో అఖిల భారత రైతు సంఘాల సంయుక్త కమిటీ పిలుపులను జయప్రదం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు ఉద్యమ నాయకులు జీగుదీప్ సింగ్, గ్రీమీద్ సింగ్, నార్వష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు