Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ రబీలో మొక్కజొన్న వెయ్యవద్దని కె.సి.ఆర్. చెప్పారని, కానీ రెండో పంటగా ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంట వేశారని, దానిని మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. మొక్కజొన్న పంటకు ప్రభుత్వ మద్ధతు ధర రు.1850/-లు యిచ్చి కొనుగోలు చేయాలని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవటం వలన రైతులు చేసిన అప్పులు తీర్చేందుకు బయట ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు రైతులకిచ్చే మద్ధతు ధరలు ప్రకటించలేదని, దీని వలన అనేక మంది రైతులు పంట గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులను చూసి వెంటనే మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం పండించిన మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని తెలిపారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒకటి, రెండు కేంద్రాలు మాత్రమే కొనుగోలు చేశారని,ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, ఆచరణలో అది అమలు కాక, రైతులు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర తక్కువ ధరకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ.కె.పి. ద్వారా ధాన్యాన్ని అన్ని కేంద్రాలలో ప్రారంభించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మార్క్‌ఫెడ్‌కు 500 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఈ డబ్బులు రైతులు పండించిన పంట కొనుగోలుకు సరిపోవని, 2 వేల కోట్లు కేటాయించి రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులుండాలని తమ్మినేని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు మద్ధతు ధర ప్రకటించి మొత్తం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తమ్మినేని ప్రభుత్వానికి హితవు పలికారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ నినాదంతో ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న మోడీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీ సరిహద్దుల్లో లక్షల మంది రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా ఎరువుల ధరలను 60% పెంచడం మరీ దారుణమని అన్నారు. వ్యవసాయ ఎరువుల ధరలు పెంచటం వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెంచి, పంటలకు మద్ధతు ధర లేకుండా చేయటం అంటే అనివార్యంగా రైతులను తమ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడ మేనని అన్నారు. ఎరువుల ధరలు 60% ఒకేసారిపెంచడం దారుణమని దీని వలన రైతులకు 3 వేల నుండి 4 వేల వరకు అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, ఇప్పటికే రైతుల పెట్టుబడులు అధికమై దిగుమతి రాక, అప్పుల భారంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఎరువుల ధరలు ఇష్టారీతిన పెంచుకో వడానికి ఎరువుల కంపెనీలకు స్వేచ్ఛనిచ్చి, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. పెరిగిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని, లేనిచో రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.