Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా జడ్జి సీహెచ్ కే.భూపతి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి పౌరునికీ సత్వర న్యాయమే న్యాయ వ్యవస్థ సంకల్పమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.కె.భూపతి పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం న్యాయసేవాసదన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశానుసారం జాతీయ స్థాయిలో నిర్వహి స్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా పలు కేసులకు సత్వర పరిష్కారం చూపుతున్నామన్నారు. పౌరులందరూ సత్ప్రవర్తనతో ఉండటం వలన మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. సయోధ్య, రాజీ అనేది పురాతన కాలంనుండే అమలులో ఉన్నాయన్నారు. రా మాయణ, మహాభారతంలో సైతం రాజీకోసం ప్రయత్నించాకనే యు ద్ధానికి వెళ్ళేవారని తెలిపారు. రాజీవలన ఇరుపక్షాలు కక్షలు వదిలి కలిసిపోతాయని, ధన వ్యయం, కాలవ్యయం లేకుండా అంతిమ శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సత్వర పరిష్కారమే లక్ష్యంగా నేడు లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజీ మార్గమే రాజ మార్గంగా లోక్ అదాలత్‌లు పనిచేస్తున్నాయన్నారు. కుటుంబ తగాదా లను పరిష్కరించడం వల్ల సభ్యుల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు లోపించాయన్నారు. నేటి సబంధాలు ఆర్థిక సంబంధాలేనగానీ హార్థిక సంబంధాలు కావని అన్నారు. సమాజహితం కోసం అందరూ పాటు పడాలని సూచించారు. లోక్ అదాలత్‌ల విజయవంతానికి బార్ అసో సియేషన్ కృషి చేస్తుందని బార్ అసోషియేషన్ అధక్షులు మలీదు నాగేశ్వరరావు తెలిపారు. కోవిడ్-19 నిబంధనల మేరకు కక్షిదా రులకు సౌకర్యాలు కల్పించామన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశా ల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లను కక్షిదారులు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.
లోక్ అదాలత్‌లో రాజీపడటం వలన అంతిమ తీర్పు వస్తుందని, ఇరు పార్టీలకు న్యాయం జరుగుతుందని న్యాయసేవా సంస్థ కార్యదర్శి జావిద్ పాషా తెలిపారు.
భార్యాభర్తలు రాజీపడటంతో భర్తపై క్రిమినల్ కేసును రద్దు చేశారు. మోటారు ప్రమాద కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ రాజీకి ఒప్పుకోవడంతో మతుని భార్య, కుమార్తెకు రూ.12 లక్షల పరిహారం అందించారు. ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్ళిన సివిల్ కేసులో ఇరు పక్షాలను రాజీచేసి పూలమొక్కలను బహూకరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు బాలభాస్కర్ రావు, తిరుపతి, పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, కుమారి డానిరూత్, అఫ్రోజ్ అక్తర్, అనితా రెడ్డి, శాంతిసోని, మౌనిక్, పూజిత, రుబీనా ఫాతిమా, ఉషశ్రీ, బార్ కార్యవర్గం గురుమూర్తి చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, సంపత్, కృష్ణారావు, రవిప్రసాద్, మాధవి తదితరులు పాల్గొన్నారు.