Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్స్ పంపిణీ
నవతెలంగాణ-గుండాల
ఉమ్మడి గుండాల మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని ఎలాంటి రహదారి సౌకర్యంలేని అత్యంత మారుమూల గ్రామం అడవి రామారం గ్రామానికి రోడ్డు, తాగునీరు, త్రీపేస్ కరెంట్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఈ మేరకు శనివారం గుండాల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ గ్రామానికి సంబంధించిన వసతుల గురించి అక్కడి ఆదివాసీ, గొత్తికోయలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సాయం కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని, సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సర్పంచ్ పాయం శ్రీదేవి మాట్లాడుతూ...
గుండాల పోలీసుల ఆధ్వర్యంలో ఎలాంటి సౌకర్యం లేనటువంటి తమ గ్రామంలో వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ రవిందర్ రెడ్డి, గుండాల సీఐ చెన్నూరి శ్రీనివాస్, ఎస్ఐ ముత్యం రమేష్, ఆళ్ళపల్లి ఎస్ఐ సంతోష్ కుమార్, అడవి రామారం ఉప సర్పంచ్ పాయం బొర్రయ్య, పొట్టయ్య, పటేల్ పాయం పాపారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.