Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయంకరంగా ఉన్న బోనకల్ - ఖమ్మం రోడ్డు
- చిరునోముల - చొప్పకట్లపాలెం రోడ్డు
- టీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదా
నవతెలంగాణ బోనకల్
మండల పరిధిలోని కలకోట గ్రామం నుండి నారాయణపురం వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్డు నిర్మాణానికి గాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుపై మండల కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కృషి ద్వారా మంజూరు అయినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉండగా కొంత మంది కాంగ్రెస్ నాయకులు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేయించారని జబ్బలు సరసు కుంటున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఈ రోడ్డు గత అసెంబ్లీ ఎన్నికల ముందు పంచాయతీ రాజ్ ద్వారా అంచనా వేయటం జరిగిందని టీఆర్ఎస్ నాయకుడు నాటి ఎంపీటీసీ భర్త ఇటికాల శ్రీనివాసరావు నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు విన్నవించడంతో ఆ రోడ్డును జడ్పీ సమావేశంలో అప్పటి జడ్పీటిసి సీపీఐ(ఎం) నాయకుడు బానోత్ కొండ ద్వారా తీర్మానం ప్రవేశపెట్టి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి ఆర్అండ్బి డిపార్ట్మెంట్కు మార్చడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో జడ్పీలో మరల తీర్మానం చేయించి పువ్వాడ అజరు కుమార్, పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వర రావు సిఫార్సు మేరకు ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఈ రోడ్డు మంజూరు కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు వాస్తవాన్ని తెలుసుకొని కృషి చేసిన ప్రజా ప్రతినిధులను అభినందించాల్సిందే పోయి నియోజకవర్గం నుంచి ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని గాని ప్రజల గాని పట్టించుకోకుండా హైదరాబాద్‌కే పరిమితమై ఉన్నారని ఈ రోడ్డు మంజూరులో ఎమ్మెల్యే పాత్ర ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ నాయకుల ప్రకటనలకు కాంగ్రెస్ నాయకులు ధీటుగా బదులిచ్చారు.
2017-18వ సంవత్సరంలో అప్పటి ఎంపీ రేణుకా చౌదరి సిఫార్సుతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా కలకోట నుండి నారాయణపురం రోడ్డుకు అంచనా వేశారు. అప్పటి టీఆర్ఎస్ గ్రామ నాయకులు ఇటుకల శ్రీనివాసరావు, మంత్రి తుమ్మల నాగేశ్వరావుకి విన్నవించినారు. అప్పటి బోనకల్ మండలం సీపీఐ(ఎం) జడ్పిటీసీ బానోత్ కొండ ద్వారా జడ్పీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా, వారు ఆర్అండ్బీ డిపార్ట్మెంట్కి బదిలీ చేశారు. కానీ ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ లో నిధులు లేకపోవడం వల్ల రోడ్డు మంజూరు కాలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. .2019వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పీఎంజీఎస్‌వై కింద కలకోట నుండి నారాయణపురం రోడ్డు మంజూరు చేయమని సిఫార్సు చేయగా, నిబంధనలు సరిగా లేకపోవటంతో అధికారులు తిరస్కరించారని తెలిపారు. దీంతో రోడ్డు గురించి భట్టి విక్రమార్కని కలిసి ప్రస్తావించగా, భట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి ఎస్టిమేషన్ వేయగా నామ్స్ అనువుగా ఉంది అని గుర్తించి రోడ్డును మంజూరు చేశారని తెలిపారు.తాము చేయని పనికి తామే చేశామని చెప్పుకుంటూ జబ్బలు సరుసుకునే అలవాటు తమకు లేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.మధిర నియోజక వర్గ ఎమ్మెల్యే భట్టి గారు నియోజకవర్గ అభివద్ధిని గాని, ప్రజలను గాని పట్టించుకోకుండా హైదరాబాద్ కే పరిమితం అయ్యారని చెప్పడం హాస్యాస్పదం. 10 సంవత్సరాల క్రితం భట్టి ఎమ్మెల్యే గా ఉండి బోనకల్ నుండి ఖమ్మం కు సింగిల్ రోడ్డుగా ఉన్న దాన్ని డబల్ రోడ్డు వేయించారు. కానీ నేడు ఆ రోడ్డు గుంతల మయంగా ఉండి నిత్యం ప్రమాదాలు జరుగుతుంటే, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా జిల్లా మంత్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మం ఎంపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. మాయ మాటలు చెబుతూ అబద్దాలు ప్రచారం చేసుకుంటూ ఎంతో కాలం పదవిలో ఉండలేరని ఎప్పటికైనా బోనకల్- ఖమ్మం రోడ్డు దుస్థితి గురించి ఆలోచించి వెంటనే ఆ రోడ్డు కి నిధులు మంజూరు చేయించాలని టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులు హితువు పలికారు. అదేవిధంగా చిరునోముల క్రాస్ రోడ్డు నుంచి చొప్పకట్లపాలెం వరకు గల రోడ్డు అత్యంత భయంకరంగా ఉందని ఈ రోడ్డు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కళ్ళకు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ప్రజల ఆదర అభిమానాలు ఉండటం వల్లే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క గెలిచారని ఈ విషయం టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవడం మంచిదని హితవు పలికారు.