Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం మండల కేంద్రంలోని గుండాల తండా రైతులు పండించిన మొక్కజొన్నలను పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మామకన్ను సర్పంచ్ కొడెం ముత్యమాచారి, సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకులు ఈసం శంకర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో సుమారుగా రెండు వేల ఎకరాల్లో యాసంగి మొక్కజొన్న పంటను సాగు చేసి కొనుగోలు చేసే దిక్కులేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయం అని చెప్పుకుంటున్న పాలకులు, రైతుల సమస్యలను పట్టించుకోకుండా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలకు మాత్రమే అనుమతిచ్చి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మరిచిపోయిందన్నారు. తక్షణమే కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే చొరవ తీసుకుని కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబొయిన ముత్తయ్య, న్యూడెమోక్రసీ నాయకులు వాంకుడోత్ అజరు, కొమరం శాంతయ్య, రామ్ చందర్, రామ్ చంద్రు జగన్, రైతులు వాల్యా, మంగీలాల్, వాగ్యా, రాము, బాలు తదితరులు పాల్గొన్నారు.