Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రజా ప్రతినిధి పై మంత్రికి ఫిర్యాదు ?
నవతెలంగాణ- బోనకల్
మండల పరిధిలోని కలకోట - నారాయణపురం రోడ్డుకు నిధుల మంజూరు పై టిఆర్ఎస్ లోనే వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. కలకోట నారాయణపురం రోడ్డు నిధులు మంజూరుపై టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులపై ఆదివారం విమర్శలు చేశారు దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా బంధం శ్రీనివాసరావుపై టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రతి విమర్శ చేశారు. బంధం శ్రీనివాస రావు కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశానని అల్ప సంతోషం పడుతున్న సమయంలో సోమవారం అనూహ్యంగా టిఆర్ఎస్ నాయకుడు నుంచే బంధం శ్రీనివాస రావుకి ఎదురుదాడి ఎదురుకావడంతో ఖంగు తిన్న ట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మండల పరిధిలోని టిఆర్ఎస్ నాయకుడు ఓ మాజీ ప్రజా ప్రతినిధి శ్రీనివాసరావుకి ఫోను చేసి ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేయటమే కాక తీవ్రంగా మందలిం చినట్లు తెలిసింది. ఇంతకీ ఆ టిఆర్ఎస్ నాయకుడి ఆగ్రహానికి కారణం కలకోట - నారాయణపురం రోడ్డు నిధుల మంజూరు విషయంపై శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు కావడం విశేషం. తమకు తెలియకుండా తమను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ముఠాలను ప్రోత్సహిస్తూ ఎన్ని రోజులు ఇలా వ్యవహరిస్తావో నేను కూడా చూస్తానంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని వెంటేసుకొని తిరుగుతూ కలకోట - నారాయణపురం రోడ్డు విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని మందలించినట్లు తెలిసింది. ఓ జిల్లా ప్రజా ప్రతినిధి సహకారంతో మా సామాజిక వర్గానికి చెందిన వారిని అణగ తొక్కాలని ప్రయత్నం చేస్తున్నావని, తాము కూడా తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ వెంటనే మంత్రి పువ్వాడ అజరు కుమార్ కు శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రోడ్డు మంజూరు విషయంపై కూడా టిఆర్ఎస్ లో ముఠా పోరు రెచ్చగొడుతూ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాడని మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన వారికి మండలంలో పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వకుండా తనకు నచ్చిన వారిని వెంట వేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని మంత్రికి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది. ఇదంతా ఓ జిల్లా ప్రజా ప్రతినిధి మండల అధ్యక్షుడు ద్వారా చేయిస్తున్నట్లు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పువ్వాడ కూడా తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. పార్టీలో వారి పోకడలను నిశితంగా గమనిస్తూనే ఉన్నానని, కేవలం మూడు నెలలు ఓపిక పట్టండి ఆ తర్వాత వారి సంగతి తేలుస్తా అని ఆ నాయకుడికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.