Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అస్తమయం
- బొజ్జి ఆశయ సాధన కోసం ముందుకు సాగుదాం
- సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన ముద్దుబిడ్డ, మచ్చలేని కమ్యూనిస్టు నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సాధారణ, సామాన్య జీవితం గడపటం ఆయన సొంతం. సీపీఐ(ఎం) అంటే చిన్ననాటి నుంచి ఎంతో మక్కువ. ప్రాణం కంటే నమ్మిన సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఆయనకు ఆయనే సాటి. నాడు మావోయిస్టులు సీపీఐ(ఎం)కి రాజీనామా చేయాలని తుపాకులతో బెదిరించిన ప్రాణమైన తీసుకుం టా గాని పార్టీకి రాజీనామా చేయనని ఎదురొడ్డిన ధైర్యశాలి. ఏజెన్సీ సుందరయ్యగా అందరికీ నచ్చిన, మెచ్చిన వ్యక్తి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి(95) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో, శ్వాస కోశ వ్యాధితో బాధపడుతూ భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అదే విధంగా గత రెండు రోజుల కిందట భద్రాచలం తీసుకొచ్చి ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించ డంతో మృతి చెందారు.
సోమవారం భద్రాచలంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సభ సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షత వహించారు. సంతాప సభలో సోమయ్య మాట్లాడుతూ.... కడవరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ఆయన మహానీయుడని అన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరుఫున అనేక ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారని, ప్రతి ఒక్కరికీ ఆయన మార్గదర్శకం అని అన్నారు. అదేవిధంగా సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, నున్నా నాగేశ్వరరావులు మాట్లాడు తూ.... మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజా బొజ్జి ఎప్పుడూ సాధారణమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అనేక సమస్యలపై ప్రజల పక్షాన అసెంబ్లీలో తన వాణిని వినిపించి ఏజెన్సీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారని వారు అన్నారు. ఎర్రజెండాతో జీవనం సాగించారని, ప్రలోభాలు, పదవులకు లొంగకుండా, అధికార పార్టీలు చూపెట్టిన సొమ్ముకు ఆశపడకుండా ఎర్రజెండా కోసమే పని చేసి కడవరకూ నమ్మిన సిద్ధాంతం కోసం కుంజా బొజ్జి పని చేశారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ... ఏజెన్సీ వాసుల మనసు దోచుకున్న వ్యక్తి కుంజా బొజ్జి అని ఆయన అన్నారు. అనేక సమస్యల కోసం ఆదివాసీల పక్షాన, గిరిజనేతరుల పక్షాన కూడా పోరాడి వాటిని పరిష్కరించటంలో ఆయనకాయనే సాటి అన్నారు. అనేక సమస్యలపై అధ్యయనం చేశారని ఆయన అన్నారు. అలాగే కొత్తగూడెం సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.... మరో ఎర్ర సూర్యుడు నేలకొరిగారని ఆయన అన్నారు. ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటే శ్వర్లు, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, మాచర్ల భారతి, ఉభయ జిల్లాల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచిలి రవి కుమార్, భూక్య వీరభద్రం, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఉభయ జిల్లాల కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, ఎంబీ నర్సారెడ్డి, కే.బ్రహ్మచారి, దొడ్డ రవికుమార్, సరియం కోటేశ్వరరావు, కారం పుల్లయ్య, యలమంచి వంశీకృష్ణ, చిలకమ్మా, పట్టణ కమిటీ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, వై.వి రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బీ.అయోధ్య, సీపీఐ రాష్ట్ర నాయకులు రావులపల్లి రాంప్రసాద్, రావులపల్లి రవికుమార్, తమ్ముళ్ల వెంకటేశ్వర రావు, పట్టణ కార్యదర్శి సునీల్, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాన్, ఎస్కే అజీమ్, పీఏసీఎస్ చైర్మెన్ అబ్బినేని శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కే.రంగారెడ్డి, కల్పనా, ముద్ద భిక్షం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి మానె రామకృష్ణ, దుమ్మగూడెం జడ్పీటీసీ సభ్యులు తెల్లం సీతమ్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొల్లు వెంకటరెడ్డి, ఎడమకంటి రోశిరెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు సోంది వీరయ్య, ముర్రా రమేష్, ప్రముఖ న్యాయవాది దేవదానం తదితరులు పాల్గొన్నారు.