Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికంది అమ్ముకునే సమయంలో అనుకోని అతిథిగా సోమవారం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సంవత్సరం సరైన దిగుబడి లేక మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని రైతులు అనుకుంటున్న సమయంలో వర్షం దెబ్బకు రైతులు లబోదిబో మంటున్నారు. పెట్టుబడితో పాటు కాయ కోతకు కూలీల రేట్లు పెరగడంతో పంట అమ్మగా వచ్చిన దానిలో సగం కూలీలకు చెల్లించాల్సి వస్తుందని ఈ తరుణంలో కాయ కోసి కల్లాలో ఆరబెట్టిన మిర్చి అనుకోని వర్షానికి కాయ తడిసి నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వెలిబుచ్చారు. కొంతమేర కళ్ళలో ఆరబెట్టిన కాయ తడవకుండా ఉండటం కోసం ఉరుకులు పరుగులు పెడుతూ కల్లాలో ఉన్న కాయలపై టార్పాలిన్ పట్టాలు కప్పి పంటను కాపాడుకున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి కాపు కాసిన మామిడి తోట లోని కాయలు రాలిపోయి చెట్ల కింద గుట్టలుగా పడిపోయాయి. ఈ వర్షాల వలన మామిడి రైతులకు అపార నష్టాన్ని చవి చూస్తున్నారు. వీటితో పాటు బొప్పాయి, అరటి, వరి, మొక్కజొన్న, మినప, తదితర పంటలు పండించిన రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.