Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు రిటర్నింగ్ అధికారుల విధులు ఎంతో కీలకమని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళీపై సమగ్ర అవగాహన పెంపొందించుకొని ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్జన్ పేర్కొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు నియమింపబడిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు డిపిఆర్సి సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణా తరగతులను సోమవారం జిల్లా కలెక్టర్ సందర్శించి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ విధులపట్ల దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుండి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు పూర్తి బాధ్యత రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులపై ఉంటుందని, నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా వార్డులవారీగా నోటీసు బోర్డుపై ప్రదర్శించుట, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల జాబితా పబ్లికేషన్, నామినేషన్ల స్క్రూట్నీ, తిరస్కరణ, నామినేషన్ల తుది జాబితా ప్రకటించడం, పోటీలో ఉన్న అభ్యర్థ్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సర్వీసు ఓటర్లకు, ఎన్నికల విధులలో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందించుట, పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు పర్యవేక్షణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయడం, పోలింగ్ అనంతరం సీల్డ్ బాక్స్ ను స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చడం, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల ఫలితాలను వెల్లడించే విధుల నిర్వహణ బాధ్యత రిటిర్నింగ్ అధికారులపై ఉంటుందని, పై అంశాలపై సమగ్ర అవగాహనను శిక్షణ తరగతుల ద్వారా పెంపొందించుకొని, నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్ శైలేంద్ర, నర్సిరెడ్డి, రామారావు, రమేష్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి నోడల్ అధికారి శ్రీరామ్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.