Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు కల కల - నేడు వెలవెల
- ఎస్ఐ వెంకటేశ్ కారణం..!
నవతెలంగాణ బోనకల్
20 ఏళ్ల క్రితం ఉగాది పండుగ వచ్చిందంటే జిల్లాలోనే అనేక ప్రాంతాల ప్రజలు చిరునోముల దారి పట్టే వారు. చిరునోముల గ్రామానికి చెందిన ప్రజలు బంధువులు, స్నేహితులు దేశంలో ఎక్కడ ఉన్నా ఉగాదికి చిరునోముల రావాల్సిందే. అంతటి ప్రాధాన్యత కలిగిన చిరునోముల గ్రామం నాటికల లేక నేడు వెలవెలబోతోంది. రంగ రంగ వైభవంగా జరిగే ఉగాది ఉత్సవాలకు నిలిచిపోవడానికి ఆనాటి బోనకల్ ఎస్ఐ ఎన్ వెంకటేష్ కారణమని గ్రామస్తులు తెలుపుతున్నారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిరునోముల గ్రామం ఉగాది పండుగకు ప్రసిద్ధిగాంచింది. చిరునోముల గ్రామం ఏర్పడినప్పుడే చిరునోముల ఊరు ముందు గుట్టపై ముత్యాలమ్మ గుడి ఉంది. ఈ గుడికి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఉగాది పండుగకు ముత్యాలమ్మ గుడి జాతర పెద్ద ఎత్తున జరిగేది. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ఇంటికొక ప్రభ కట్టేవారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేసేవారు. రికార్డింగ్ డాన్స్ కోసం గుంటూరు చిలకలూరిపేట నుంచి డాన్సర్లను తీసుకువచ్చేవారు. గ్రామస్తులు పోటీలుపడి రికార్డింగ్ డాన్స్ ప్రభలు ఏర్పాటు చేసేవారు. చూడటానికి భద్రాచలం నుంచి కూడా యువకులు చిరునోముల గ్రామానికి వచ్చేవారు ఉగాది పండుగ రోజే ప్రారంభమైన రికార్డింగ్ డాన్స్ మరుసటి రోజు సాయంత్రం వరకు జరిగేది. జిల్లా వ్యాప్తంగా రావడంతో ప్రతి ఇల్లు బంధువుల స్నేహితులతో నిండిపోయేది. ఇసుక వేస్తే రాలనంత జనం చిరునోములలో ఎక్కడ చూసినా కనిపించే దశ్యం. ప్రస్తుతం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు ఎలా జరుగుతున్నాయో 20 ఏళ్ళ క్రితం చిరునోముల గ్రామంలో కూడా ఉగాది ఉత్సవాలు జరిగాయి. అటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉగాది పండుగ ఉత్సవం నేడు కళ తప్పింది.
2001లో బోనకల్ ఎస్ఐ గా ఎన్ వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులు రెండు ప్రభలలో రికార్డింగ్ డాన్స్ గ్రూపు ఏర్పాటు చేశారు. గ్రామంలో రికార్డింగ్ డాన్స్ నడుస్తూనే ఉంది. ఈ విషయం తెలిసిన ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో చిరునోముల వెళ్లి కార్యక్రమాన్ని నిలిపివేశారు. గ్రామస్తులందరూ ఎంత ప్రాధేయపడినా ఎస్ఐ కనికరించలేదు. దీంతో ఆ నాటి నుంచి నేటి వరకు ఉగాది పండుగ ఉత్సవాలు నిలిచిపోయాయి. ఉత్సవాలు నిలిచిపోయి నేటికీ 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మొక్కులు తీర్చుకునే వారు మాత్రమే ప్రబల కట్టుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా యువకులు కమిటీగా ఏర్పడి ఉగాది పండుగ రోజు ముత్యాలమ్మ గుడికి విద్యుత్ దీపాలతో అలంకరణ చేస్తూ సాదాసీదాగా ఉగాది పండుగను నిర్వహిస్తున్నారు.