Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడసారి చూపుకు తరలివచ్చిన నాయకులు, ప్రజలు, అభిమానులు
- నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రాష్ట్ర, జిల్లా నేతలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జికి సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నేతులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. సోమవారం భద్రాచలం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ కుంజా బొజ్జి కన్నుమూసిన విషయం విదితమే. భద్రాచలం సీపీఐ(ఎం) కార్యాలయంలో సంతాప సభ నిర్వహించి బొజ్జి భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామానికి తరలించారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బొజ్జి స్వగ్రామమైన వర రామచంద్రపురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామంలో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, వేలాదిగా తరలి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కుంజా బొజ్జిను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కుంజా బొజ్జి భౌతిక కాయాన్ని తెలంగాణ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... ఆదర్శ కమ్యూనిస్టు నేత కుంజా బొజ్జి అని ఆయన అన్నారు. పార్టీ సిద్ధాంతం కోసం ఆశయాల కోసం కడవరకు ప్రజాజీవితాన్ని జీవించారని అన్నారు. నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శప్రాయమ న్నారు. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, నిజమైన కమ్యూనిస్టు నేత కుంజా బొజ్జి అని పేర్కొన్నారు. ఎర్ర జెండాకు వన్నెతెచ్చిన కుంజా బొజ్జి, ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మన్నెంలో పూసిన ఎర్ర మందారాలు మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజా బొజ్జిలని ఆయన అన్నారు. గిరిజన ఉద్యమాల ధృవతార లుగా వారు నిలిచిపోయారని అన్నారు. ఆదివాసీలకు అండగా నిలబడటమే వారికి మనం ఇచ్చే నిజమైన, ఘనమైన నివాళి అన్నారు. అదే విధంగా ఈ సభలో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ... అమరజీవి కుంజా బొజ్జి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలన్నారు. కుంజా బొజ్జి జీవితం ఈ తరానికే కాదు రాబోయే తరాలకు కూడా ఎంతో ఆదర్శమన్నారు. నిరాడంబర జీవితం ఆయనకే సాధ్యమైందని, ప్రతి ఒక్క కమ్యూనిస్టు ఈ ఆదర్శాలతో ముందుకు సాగాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కుంజా బోజ్జి సాధారణ జీవితం గడపటం అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు. గిరిజన సమస్యలపై అధ్యయనం కలిగిన, అవగాహన కలిగిన వ్యక్తి బొజ్జి అని ఆయన అన్నారు. ఏజెన్సీలోని ఎన్నో సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో తన వాణిని వినిపించి పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి కుంజా బొజ్జి అన్నారు. అదేవిధంగా భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ... పార్టీల కోసం పనిచేసిన నాయకుడు అని ఆయన అన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఆడంబరాలకు పోకుండా, సామాన్యుడిగా ఉంటూనే ప్రజా జీవితం కలిపిన అమరజీవి బొజ్జి అని ఆయన అన్నారు. ఇంకా ఈ సభలో ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ బొజ్జి సాధారణ జీవితం ఎందరికో ఆదర్శమన్నారు. నేటి తరానికి రాబోయే తరాలకు కూడా బొజ్జి గడిపిన సాధారణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌లు మాట్లాడుతూ... నిజమైన ఆదర్శ కమ్యూనిస్టు బొజ్జి అని అన్నారు. నిరాడంబర జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ సంతాప సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, రాజమహేంద్రవరం పార్టీ కార్యదర్శి అరుణ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి రవి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు భూపాల్, బి.మధు, వంగూరు రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచిలి రవి కుమార్, అన్నవరపు సత్యనారాయణ, కె.బ్రహ్మచారి, గుగులోతు ధర్మ నాయక్, భద్రాచలం, వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం మండల కార్యదర్శులు గడ్డం స్వామి, బొప్పెన కిరణ్, సీసం సురేష్, పెంటయ్య, నాయకులు ఎంబీ నర్సారెడ్డి, బండారు శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.