Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గాలి దుమ్ముతో కూడిన అకాల వర్షానికి చేతికందే పంట తడిసి నేల రాలి పోవడంతో అట్టి దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి కె విజయ భాస్కర్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఆకుల వేణు, మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం, నరసింహ పురం, తదితర గ్రామాలలో కురిసిన అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సోమవారం నవతెలంగాణ పేపర్ లో శీర్షిక ప్రకటనతో కదిలిన అధికారులు, కాపుకాసి కోత కోసే సమయంలో మామిడి తోటలలో నేలరాలిన మామిడి కాయలు, కోత దశకు వచ్చి నేలకొరిగిన వరి, మొక్కజొన్న తోటలతో పాటు కల్లాలో తడిసిన మిర్చిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జరిగిన పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని అక్కడినుండి అందే ఆదేశాలను అనుసరిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ సాగు కోసం వడ్డీకి అప్పులు తెచ్చి కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితి అయిందని అధికారులతో రైతులు వాపోయారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందించాలని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి సుష్మా, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.