Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొజ్జి సంస్మరణ సభలో నున్నా, పొన్నం
నవతెలంగాణ-ఖమ్మం
సీపీఐ(ఎం) సీనియర్ నేత, భద్రాచలం మాజీ శాసనసభ్యులు కుంజా బొజ్జి అందరికీ ఆదర్శ ప్రాయుడని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఆఫీస్ సుందరయ్య భవన్లో ప్రకాష్ అధ్యతన జరిగిన సంస్మరణ సభలో నున్నా మాట్లాడుతూ.. 1926 పిభ్రవరి 10వ తేదిన వి.ఆర్.పురం మండలం, అడివివెంకన్నగూడెం గ్రామంలో నిరుపేద ఆదివాసి కుటుంబంలో జన్మించిన బొజ్జిని కమ్యూనిస్టు ఉద్యమం ప్రజానాయకుడిగా మార్చిందన్నారు. 1948-1950 మధ్య కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దళాలు వి.ఆర్.పురం ప్రాంతానికి రక్షణ కోసం ప్రవేశించిన సమయంలో బొజ్జికి దళాలతో పరిచయం ఏర్పడి, దళాలకు కొరియర్‌గా పనిచేయటం ప్రారంభించారని, ఆ పరిచయం బొజ్జిని కమ్యూనిస్టు ఉద్యమంవైపు నడిపిందని తెలిపారు.
1951-1952 ప్రాంతంలో ఏర్పాటైన మొదటి కమ్యూనిస్టు శాఖలో సభ్యునిగా బొజ్జి ప్రజా జీవితం ప్రారంభమై, 2021 ఏప్రిల్ 12 వరకు సాగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మేకల పుల్లరి, ఫారెస్టు దోపిడీ, తునికాకు కట్ట రేట్లు పెంపు, భూముల రీసర్వే, భూ పంపిణి, సాగు భూములపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లపై పోరాటాలు నిర్వహించారని, ఈ పోరాటాలలో బొజ్జి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. 95 సంవత్సరాల వయస్సులోను అనేక పోరాట ఘటనలు, తేది, సమయం వంటి విషయాలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నారన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలలో చురుకుగా వ్యవహరిస్తున్న బొజ్జి, కమ్యూనిస్టు సిద్దాంతం ఆచరణ పట్ల కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికల నేపథ్యంలో 1964లో సిపిఎం వైపు నిలబడి తుదిశ్వాస విడిచేవరకు, పార్టీ లోనే కొనసాగారని కొనియాడారు. భూముల రీసర్వే కోసం, భూ హక్కులకోసం ధర్నా చేస్తుంటే ప్రభుత్వం లాఠిచార్జి చేసి తల పగలగొట్టిందని, అయినా సరే పట్టు వీడక పోరాటం చేయటంతో భూములు సర్వే చేసి హక్కులు కల్పించారన్నారు. సీపీఐ(ఎం)ను దెబ్బతీయటం కోసం అనాటి పీపుల్స్‌వార్ నక్సలైట్లు బొజ్జిని 1983లో పార్టీకి రాజీనామా చేయాలని, లేదంటే చంపుతామని బెదిరించినప్పటికీ, బెదరకుండా భద్రాచలం నియోజకవర్గం అభివద్ధికి అశేష కషి చేశారని, ఒకవైపు సిపిఎం ప్రజా పోరాటాలు, మరోవైపు సిపిఎం ప్రజా ప్రతినిధుల కషి కలిసి ఈ ప్రాంత అభివద్ధి ముందుకు సాగిందన్నారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి సోడి భద్రయ్యను ఓడించి మొదటి సారిగా ఎంఎల్ఏగా గెలుపొందారని, తర్వాత 1989, 1994 లో కూడా గెలుపొంది వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు బొజ్జిని అన్నారు. తాను నమ్మిన ఎర్ర జెండాకి, సీపీఐ(ఎం) విప్లవ రాజకీయాలకు వన్నె తెచ్చిన బొజ్జికి విప్లవ జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యార్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, బండారు రమేష్, మాచర్ల గోపాల్, ఎం.డి.గౌస్, వై.శ్రీనివాసరావు, వాసిరెడ్డి వీరభద్రం, బివికె రామారావు, పుల్లారావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.