Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-బోనకల్
గ్రామీణ ప్రాంతాలలో వివిధ క్రీడలలో ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేక వారు రాణించలేక పోతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది మండల స్థాయి క్రికెట్, కబడ్డీ పోటీలను మంగళవారం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల వలన శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. బోనకల్ మండలం బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుట్టినిల్లు అన్నారు. మండలం నుంచి జాతీయస్థాయిలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉండటం మండలానికి గర్వకారణమన్నారు. పోటీలో పాల్గొనటానికి వచ్చిన క్రీడాకారులు అందరికీ అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడని విమర్శించారు.
ఈ పోటీల సందర్భంగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు ఈ పోటీలు ఈనెల 21 వరకు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు పాల్గొన్నారు.
బహుమతుల వివరాలు
ఈ పోటీల విజేతలకు క్రికెట్ మొదటి బహుమతి గా రూ.10016, ద్వితీయ బహుమతిగా రూ.5016 నగదును అందజేస్తామని నిర్వాహకులు కందుల పాపారావు తెలిపారు. కబడ్డీ ప్రధమ బహుమతి గా రూ. 8016, ద్వితీయ బహుమతిగా రూ 4016, తృతీయ బహుమతిగా రూ.3016 నగదుతో పాటు షీల్డ్ కూడా అందజేస్తామన్నారు.
జాలి ముడి కాలువను పరిశీలించిన భట్టి
మండల పరిధిలోని కలకోట నుంచి బ్రాహ్మణపల్లి వరకు గల జాలిముడి ప్రాజెక్టు కాలువను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట తనయుడు బట్టి ఆదిత్య, కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.