Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి వద్ద తీసుకున్న సొమ్మును చెల్లించకుండానే హత్య
- మర్డర్ మిస్టరీని ఛేదించిన భద్రాద్రి పోలీసులు
- వివరాలు వెల్లడించిన సీఐ టి.స్వామి
నవతెలంగాణ-భద్రాచలం
నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కొడుకు హత్య చేసిన ఘటనను భద్రాద్రి పోలీసులు చేధించారు. సాధారణ మరణంగా ఉన్న ఈ కేసును పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో కన్న కొడుకు తల్లిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సుమారు నాలుగు నెలల అనంతరం ఈ కేసును వారు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం సీఐ టి.స్వామి వెల్లడించారు. భద్రాచలానికి చెందిన యర్రం శెట్టి బసవ పార్వతమ్మ (70) గత ఏడాది డిసెంబరు 23వ తేదీన మృతి చెందారు. మృతురాలి పెద్దకుమారుడు యర్రంశెట్టి వెంకటరత్నం నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో పోలీసులు ఈ కేసును అసహజ మరణంగా నమోదు చేశారు. ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ జి.వినీత్ పర్యవేక్షణలో ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా కన్న చిన్న కొడుకే తల్లిని కడతేర్చినట్లు విచారణలో తేలింది. ఇదిలా ఉండగా యర్రంశెట్టి బసవ పార్వతమ్మ చిన్న కుమారుడు శ్రీనివా సరావు రూ.9 లక్షలు తల్లిదగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఈ సమయంలో మూడు నెలల పాటు రూ.18 వేలు చొప్పున వడ్డీ చెల్లించి నిలిపివేశారు. ఈ సమయంలో తల్లి బసవ పార్వతమ్మ తను ఇచ్చిన రూ.9 లక్షల వెంటనే చెల్లించాలని చిన్న కుమారుడు శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ముందు కూడా ఈమె గట్టిగా తన సొమ్మును చెల్లించాలని నిలదీసింది. తన తల్లికి చెల్లించాలని సొమ్ము విషయంలో ఆలోచన చేసిన శ్రీనివాసరావు పథకం పన్ని తల్లిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో గత ఏడాది డిసెంబరు 23వ తేదీన అర్ధరాత్రి అంబేద్కర్ సెంటర్లోని తన తల్లి ఇంటికి స్కూటీపై వెళ్లి, కొద్దిసేపు తల్లితో మాట్లాడి, అనంతరం గొంతు నులిమి చంపి వేసినట్టు సీఐ పేర్కొన్నారు. ఇదే సమయంలో మృతురాలి వద్ద నుంచి బంగారు నానుతాడు, చెవి దిద్దులు, రూ.9 లక్షల రాసి ఇచ్చిన నోట్‌ను స్వాధీనం చేసుకొని అతను ఏమీ తెలియనట్టు వెళ్ళి పోయారు. అయితే డిసెంబర్ 24న కుటుంబ సభ్యుల ద్వారా తన తల్లి చనిపోయిందని తెలుసుకొని, చిన్న కుమారుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ఏమి తెలియనట్టు వచ్చారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు వెంకట రత్నం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో గల ఓంకార్ పండ్ల దుకాణంలో పోలీసులు సిబ్బందిని విచారణ చేశారు. ఈ సమయంలో చిన్న కుమారుడు శ్రీనివాసరావుపై అనుమానం రావడంతో విచారణ చేపట్టడంతో తన తల్లిని తాను చంపినట్టు విచారణలో ఒప్పుకున్నట్టు సీఐ స్వామి తెలిపారు. అదే విధంగా బంగారు నానుతాడు, చెవు దిద్దులు, ప్రాంసరీ నోటు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. శ్రీనివాసరావును రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు సీఐ తెలిపారు.