Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలందించే క్రమంలో అన్ని మౌళిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా రూ.90 లక్షలతో నిర్మించిన ఆక్సీజన్ జనరేటెడ్ ప్లాంట్‌ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో రోగులకు అత్యవసరమైన ఆక్సీజన్‌ను నిల్వచేసుకునేందుకు గతేడాది లిక్విడ్ ఆక్సీజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దానికి హైద్రాబాదు నుండి ఆక్సీజన్ రావాల్సిన పరిస్థితి ఉండేదని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే ఉత్పత్తి చేసుకునే ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిద్వారా ప్రతిరోజు 125 సిలీండర్ల మేర ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందని, దీనితో ఆక్సీజన్ సమస్యను అధిగమించామన్నారు. ఇక అన్ని సందర్భాల్లో అవసరైన రోగులకు నిత్యం ఆక్సీజన్ అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, కార్పోరేటు ఆసుపత్రుల స్థాయిలో వైద్య సేవలందించగలుగు తున్నామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే గాంధీ ఆసుపత్రి తర్వాత ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఆక్సీజన్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి. కర్జన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ బి.శ్రీనివాసరావు, డిఎస్ఎం ఐడిసి వెంకటేశ్వర్లు, ఏఓ రాజశేఖర్ గౌడ్, వైద్యధికారులు, సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.