Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ కుంజా బొజ్జి సంతాప సభ వామపక్షాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూల మాల వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతం కోసం ఆశయాల కోసం కడవరకు ప్రజాజీవితాన్ని జీవించిన వ్యక్తి కుంజా బొజ్జి అని కొనియాడారు. అయన నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శప్రాయ మన్నారు. మన్నెంలో పూసిన ఎర్ర మందారాలు మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజా బొజ్జిలని తెలిపారు. పార్టీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి భద్రాచలం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు భయ్య రాము అధ్యక్షతన నిర్వహించగా ఎన్డీ జిల్లా నాయకులు ముద్ద బిక్షం, సీపీఐ మండల కార్యదర్శి అలవాల సీతారామ్ రెడ్డి, నాయకులు రాయల వెంకటేశ్వర్లు, బర్ల తిరుపతయ్య, కనకం వెంకటేశ్వర్లు, ప్రతాప్, పేరాల శ్రీను, మువ్వ వెంకటేశ్వర్లు, పాండవుల బిక్షం తదితరులు పాల్గొన్నారు.