Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరి, మిరప రైతులకు తీవ్ర నష్టం
నవతెలంగాణ-బూర్గంపాడు/సారపాక
బూర్గంపాడు మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. నోటి కాడి ముద్దను గద్ద తన్నుకు పోయినట్లుగా తమ పరిస్థితి ఉందని రైతులు తమ ఆవేదనను వెల్లబుచ్చుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా కాస్తున్న మబ్బులకు బిక్కుబిక్కుమంటున్న రైతుల ఒక్కసారిగా తెల్లవారుజామున కురిసిన వానకి తీవ్రంగా నష్టపోయారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం ఈ వర్షం కారణంగా నీటమునిగింది. అదేవి ధంగా మొరంపల్లి బంజరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న దాన్యం కొనుగోలు కేంద్రంలో ముందు గానే రైతులు తెచ్చిపెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయి నీటిలో తెలియడుతున్నాయి. మండల వ్యాప్తంగా చాలాచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు ఈ వర్షం కారణంగా చాలావరకు నేలకొరి గాయి. అదేవిధంగా ఈ వర్షం కారణంగా కొన్ని చోట్ల మిరప కల్లాలు తడిసి ముద్దాయి అన్నదాతను అప్పుల పాలు చేసింది. ప్రభుత్వాలు పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం అందజేయాలని రైతులు వేడుకుంటున్నారు.
టేకులపల్లి : మండల పరిధిలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలతో మొక్కజొన్న, మిర్చి, యాసంగి వరి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధ, గురు వారాలలో కురిసిన వర్షం, గాలికి టేకులపల్లి, తడికలపూడి, బేతంపూడి, కోయగూడెం, ముత్యాలం పాడు, కొప్పు రాయి తదితర పంచాయతీల్లో మొక్కజొన్న, వేసంగి వరి పంట వీచిన గాలికి నేలకొరిగింది. ఆరు కాలం కష్టపడి చేతికొచ్చిన మిర్చి పంట కళ్ళలలో వర్షానికి తడిసి ముద్దయింది. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో సబ్సిడీపై పద్ధతిలో అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇల్లందు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చల్లసముద్రం పంచాయతీ పరిధిలోని పంటలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న వ్యసాయ శాఖ ఏడీ వాసవి రాణి, మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్, ఆత్మ చైర్మెన్ వెంకన్నతో కలిసి గురువారం ఆంజనేయ పురంలో పంట పొలనాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. యాసంగి 50 ఎకరాలు, మొక్కజొన్న 125 ఎకరాలు, 6 ఎకరాల్లో బొబ్బర పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటంతా పనికి రాకుండా పాడైపోయిందన్నారు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. రైతులకు సాయం అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు పాల్గొన్నారు.
చర్ల : అకాలంగా కురిసిన వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని మండల సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసిన వరి, మిర్చి పంటలను పార్టీ బృందం పరిశీలించింది. అకాల వర్షానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం సత్వరమే అంచనా వేయించి నష్టపరిహారం కల్పించాలని సీఐటీయూ నాయకులు నాకొండా చరణ్ డిమాండ్ చేశారు. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోదావరి తీర ప్రాంతంలో గల మిర్చిలోకి నీరు చేరి కొట్టుకుపోయి, చేతికొచ్చిన వరి పంట నేలమట్టమైంది. నాయకులు గోదావరి తీర ప్రాంతంలో గల మిర్చి తోటలను, వరి పొలాలను కలియతిరిగి జరిగిన నష్టాన్ని గుర్తించి సివిల్ సప్లైస్ డీటీ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించారు. అధిక వర్షాభావంతో రైతుకు కలిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపిస్తామని డీటీ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మచ్చా రామారావు, శ్యామల వెంకటేశ్వర్లు, నల్లగట్ల మూర్తి, కొమరయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.
పంట నష్టం ప్రతిపాదనలు పంపుతాం...పి.శివ ప్రసాద్ ఏఓ
అకాల వర్షానికి జరిగిన మిర్చి వరి పంట నష్టం ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు వెంటనే పంపిస్తాం. మండల వ్యాప్తంగా సుమారు 110 ఎకరాలలో వరి పంట నష్టం కలిగినట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా మిర్చి సైతం 50 ఎకరాలలో నష్టపరిహారం జరిగినట్టు అంచనాకు రావడం జరిగింది.