Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు
- జీఎం పివి.సత్యనారాయణ
నవతెలంగాణ-టేకులపల్లి
సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో ఇల్లందు సింగరేణి ఏరియా ఉత్పత్తిలో నాలుగో స్థానాన్ని సాధించిందని జీఎం పివి. సత్యనారాయణ తెలిపారు. గురువారం మండలంలోని సింగరేణి గెస్ట్ హౌస్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020-21 సంవత్సరంలో 62.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి గాను 49.23 టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేసి 79శాతం లక్ష్యాన్ని చేరుకుందన్నారు. మార్చి 2021 నెలలో 6.06 లక్షల టన్నుల బొగ్గును బట్వాడా చేయడం జరిగిందన్నారు. ఇల్లందు సీహెచ్ ద్వారా 2020-21లో 21.05 లక్షల టన్నులు, తడికలపూడి సైడింగ్ ద్వారా 7.36, మొత్తం రైలు ద్వారా 28.41, రోడ్డు ద్వారా 12.83 మొత్తం 41.24 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్టు తెలిపారు. కోయగూడెం ఓసీలో ఇండ్లు, భూములు కోల్పోయిన కుటుంబాలకు సంబంధించిన ఏడుగురు మహిళలకు, 32 మంది పురుషులకు ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. కార్మిక వాడల్లో ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యం, కరోనా బారిన పడిన ఉద్యోగులకు 15 రోజులు సెలవులుతో కూడిన జీతం, ఇటీవల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. 118 మందికి కారుణ్య నియామకాలు, రిటైర్డ్ అయిన వైద్య సౌకర్యం కోసం 976 మందికి హెల్త్ కార్డులు, 116 మందికి గృహ రుణ వడ్డీ చెల్లింపు, సింగరేణి సేవా సమితి ద్వారా 40 మందికి టైలరింగ్, 40 మందికి మగ్గం, 60 మందికి మోటర్ డ్రైవింగ్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇల్లందులో సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా 39 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామన్నారు. ఈ సమావేశంలో కోయగూడెం ప్రాజెక్టు అధికారి ఎం.మల్లయ్య, ఎస్ఓటు జీఎం.బండి వెంకటయ్య, డీజీఎం పర్సనల్ సీహెచ్ లక్ష్మినారాయణ, ఐఈడీ అధికారి ఎం.గిరిధర రావు, సీనియర్ పీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.