Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతికొచ్చిన పంట నేలపాలు
- పలు పంటలకు భారీగా నష్టం
- జిల్లా వ్యాప్తంగా 340 ఎకరాల్లో పంట నష్టం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కురిసిన భారీ వర్షంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మిర్చి, వరి, జొన్న, మొక్క జొన్న, మామిడి, అరటి పంటలు నీట మునిగాయి. ఉదయం నుంచి జిల్లాలో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయానికి అకాల వర్షం వారి పాలిట శాపంగా మారింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి రాసులపై వరుణుడు ప్రభావం తీవ్రంగా చూపాడు. ఇల్లందు, సుజాతనగర్, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో రైతులు ఆరబోసిన మిర్చి వానకు తడిసిపోయింది.
ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం....
అకాలంగా కురిసిన వర్షంతో పలు పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ముఖ్యంగా ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు మండలాల్లో చేతికొచ్చిన ఉద్యాన పంటలు నేలపాలు అయ్యాయి. చుంచుపల్లి, ములకలపల్లి మండలాల్లో ఉన్న జగన్నాధపురం, గరిమెళ్లపాడు తదితర గ్రామాల్లో మామిడి అరటి తోటలకు నష్టం కలిగింది. మామిడి చెట్లు నెలకొరిగాయి. ములకల పల్లిలో 35 ఎకరాల్లో మామిడి, 50 ఎకరాల్లో అరటి పంటకు నష్టం కలిగింది. గరిమెళ్లపాడు నర్సరీలో మామిడి, కొబ్బరి, సరుగుడు చెట్లు గాలి వానకు నెల మట్టమయ్యాయి. నెట్ల కింద ఉన్న నర్సరీలు, వివిధ కూరగాయల పంటలకు భారీగా నష్టం కలిగింది. మామిడి పంట నష్టంతో రైతులు కుదేలు అయ్యారు. మార్కెట్కు తరలించే సమయంలో వరుణుడి ప్రభావంతో మామిడి రైతు నడ్డి విరిగినట్లయింది. మిరప పంట కోత, కల్లాలలో ఆరబెట్టే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో నల్ల పట్టాలు కప్పినప్పటికీ తడిసిపోయాయి. తడిసిన మిర్చిని బస్తాల్లోకి తీకుసుని పొడి ప్రదేశాల్లో ఆరబెట్టే ప్రయాత్నాలు చేస్తున్నారు.
రైతు యాజమాన్యం పాటించాలి : జినుగు మరియన్న, జిల్లా ఉద్యాన శాఖాధికారి
అకాలంగా కురిసిన వర్షంతో ప్రస్తుతం తేమ వాతావరణం వలన మామిడిలో మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. తెగులు నివారణకు లీటర్ నీటికి ఒక గ్రాము బావిస్టిన్, లేదా రెండు గ్రాములు సాఫ్ కలిపి పిచికారి చేయాలని, రాలిన కాయలను మార్కెట్లుకు తరలిం చోకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కూరగాయల పంటల పరిస్థితి పూత , కాత దశలో ఉన్నవి కావున ప్రస్తు తం చీడ పీడల నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల పేప నూనె కలిపి పిచికారి చేయాలని కోరుతున్నారు. ఆకు కూరల పంటలకు అకు మచ్చ తెగులు రాకండా ఉండేందుకు 5 మిల్లి లీటర్ల పేప కషాయాన్ని పిచికారి చేయాలని ఉద్యాన శాఖాధికారి జినుగు మరియన్న సూచిస్తున్నారు.
ఇతర పంటలకు నష్టం...
జిల్లాలో వరికి తీవ్ర నష్టం కలిగింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు ప్రాధమిక సర్వే నిర్వహించారు. వారి లెక్కల ప్రకారం జిల్లాలో కురిసిన వార్షలకు వరి, జొన్న, వేరుశనగ, జొన్న పంటలకు నష్టం కలిగింది. ఇల్లందు మండలలోని రెండు గ్రామాల్లో నష్టం కలిగింది. 33 మంది రైతులు సాగుచేస్తున్న48 ఏకరాల్లో పంటనష్టం కలిగింది. సుజాతనగర్లో వరి పంట పండిస్తున్న ముగ్గురు రైతులకు చెందిన 4 ఎకరాల్లో నష్టం కలిగింది. ములకలపల్లిలో 40 ఎకరాలు, చర్లలో110 ఎకరాల్లో నష్టం కలిగింది. జిల్లా వ్యాప్తంగా 202 ఎకరాల్లో వరిపంటకు నష్ట కలిగింది. మొక్క జొన్న పండించిన 46 మంది రైతు పొలాల్లోని 45ఏకరాల్లో పంట నష్టం వాటిలింది. 30 ఎకరాల్లో నువ్వుల పంటలకు, 60 ఎకరాల్లో జొన్న పంటకు నష్టం కలిగినట్లు సమాచారం. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 340 ఎకరాల్లో పంట నష్టం కలిగిందని జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు వెల్లడించారు.