Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- గాంధీ చౌక్
ఇటీవల మంత్రులు కేటీఆర్, పువ్వాడ, వేముల ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన ఖమ్మం కొత్త బస్టాండ్ లో షాపుల యజమానులు 'అంతా వారిష్టం' అన్నట్టుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ద్వారా ఆర్టీసీ అధికారులు ఆ షాపులను కేటాయించారు. వీటి టెండర్ దక్కించుకున్న వ్యాపారులు ఏ షాపుకైతే టెండర్ వేశారో అదేషాపు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఖమ్మం కొత్త బస్టాండ్లో అందుకు విరుద్ధంగా కొందరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బస్టాండ్లో ఒక్క షాపును మాత్రమే తాగునీటి బాటిళ్లు అమ్ముకునేందుకు కేటాయించగా మిగిలిన అన్ని షాపుల్లోనూ అనధికారికంగా బాటిళ్లు విక్రయిస్తున్నారు. అంతే కాదు టెండరు ద్వారా ఓ పాప్ కార్న్ షాపును దక్కించుకున్న వ్యక్తి దానికి అనుబంధంగా వేరే వస్తువులను కూడా విక్రయించుకుంటున్నాడు. మరో షాపులో అనధికారికంగా టీస్టాల్ నడుపుతున్నారు. వాస్తవానికి టెండర్ల జాబితాలో టీస్టాల్ లేదు. అయినా బహిరంగంగానే టీస్టాల్ నడుపుతున్నారు. కొత్త బస్టాండ్ లో ఇలా అనధికారికంగా వ్యాపారాలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.