Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మం నగర పరిధిలోని దానవాయి గూడెం నుంచి రఘునాధపాలెం మండలంలోని పాపాటపల్లి వరకు రహదారిని రెండు వరుసల రహదారిగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేస్తూ గురువారం జీవో జారీ చేసిందని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్లు మీదుగా పాపటపల్లి వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ రహదారిని రెండు వరుసల రహదారిగా విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ రహదారి ఖమ్మం నుంచి మహబూబాద్ జిల్లా డోర్నకల్‌కు దగ్గర దారి అవుతుంది. ఈ రహదారి మార్గంలో 4.45 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు, 10.15 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గతంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారిని ఇటీవల రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి మార్చారు. ప్రస్తుతం ఈ రహదారి విస్తరణకు రోడ్లు భవనాల శాఖ వారు 33 కోట్లు నిధులు మంజూరు చేశారు.
ఈ రహదారి ఇరుకుగా ఉండి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తీర్థాల జాతర సమయంలో కూడా వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రజలు, వాహనదారులు నిత్యం ఇరుకు రహదారి మార్గంలో ప్రయాణించడానికి అవస్థలు పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వారి సహకారంతో రహదారి విస్తరణకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు.