Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
నవతెలంగాణ-గాంధీచౌక
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆర్.ఓలు, ఏ.ఆర్.ఓలు, నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసిసి, సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో గురువారం సాయంత్రం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆయా విధులు నిర్వర్తించే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరుగుతుందని, అందుకు గాను 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం, డి.ఆర్.డి.ఏ, జిల్లా పరిషత్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం, రోడ్లు భవనాల శాఖ కార్యాలయం, జిల్లా సహాకార శాఖ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నామినేషన్ పత్రాలను సమర్పించే సమయంలో అభ్యర్థులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్.డి.ఓ రవీంధ్రనాథ్, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, ఏ.సి.పి ప్రసన్న కుమార్, నోడల్ అధికారులు శ్రీరామ్, మాస్టర్ ట్రైనర్స్ శైలెంద్ర, నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.