Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందా లేదోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంటల సాగు విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్బంధ పంట సాగు విధానాన్ని అమలు చేశారు దీంతో రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలను సాగుచేశారు. అయితే బోనకల్ మండలంలో తుఫాను ప్రభావంతో ఈ ఏడాది సాగుచేసిన పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని, ఒకవేళ సాగుచేసినా ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేసిం. అయినా అన్నదాతలు వాన కాలంలో సాగు చేసిన పంటలు దెబ్బతినటంతో పత్తి పంటను పూర్తిగా తొలగించి మండలంలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. జిల్లాలోనే అత్యధికంగా మండలంలో 11,981 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగుచేశారు మధ్యలో సాగునీటి వసతి లేక మొక్కజొన్న పంటకు కొంత కొంత నష్టం కలిగించిన మొత్తంమీద మొక్కజొన్న పంట మండలంలో ఆశాజనకంగానే ఉందని అన్నదాతలు అంటున్నారు. ఒక్కొక్క ఎకరానికి 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 11,981 ఎకరాలకు గాను మండల అన్నదాతలు 23 కోట్ల 96 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పంటను పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయినట్లు ఉంది. సాధారణంగా ఒక ఎకరానికి 30 క్వింటాళ్ళ మొక్కజొన్న పంట దిగుబడి వస్తోంది. మండల వ్యాప్తంగా మూడు లక్షల 59 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం ప్రతి ఏడాది మండలంలో గల 9 సహకార సంఘాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసేది రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాల లోనే తమ పంటను అమ్ముకునేవారు. కానీ నేడు అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో అన్నదాతలు తమ మొక్కజొన్న పంటను ఎలా అమ్ముకుంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది.ఒకవేళ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే మరోమార్గం లేక అన్నదాతలు ప్రయివేటు వ్యాపారులకు కారుచౌకగా అమ్ముకోవాల్సిందే.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందే
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్మినేని నాగేశ్వరరావు తుళ్లూరు రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. రైతులు ఇప్పటికే అనేక రకాలుగా నష్టపోయి అప్పులపాలై ఉన్నారన్నారు. మొక్కజొన్న పంట ప్రస్తుతం రైతులను ఎంతోకొంత ఆదుకునే విధంగా ఉందన్నారు.