Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర పాలక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం షురూ
- 60 డివిజన్లకు గాను ఆరు నామినేషన్ కేంద్రాలు
- నామపత్రాల సమర్పణకు రేపు తుది గడువు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నగర పాలక సంస్థ ఎన్నికల నగారా మోగడం... మూడు రోజులు మాత్రమే నామినేషన్ల సమర్పణకు గడువు ఉండటంతో అభ్యర్థులు ఎన్నికల అధికారులకు నామపత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తొలిరోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీనిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు కాగా మరో ఇద్దరిలో ఒకరు సీపీఐ(ఎం), మరొకరు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థికీి బీఫారమ్ ఇవ్వలేదు. అధికారపార్టీతో పాటు ఇతర పార్టీలు సైతం పొత్తుల విషయంలో ఇంకా ఓ స్పష్టమైన అవగాహనకు రాలేదు. శనివారం నాడు పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటుంది. దీనికితోడు ఆదివారం వరకు మాత్రమే నామినేషన్లకు సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర అంశాలపై నిర్ధారణకు నేడే తుదిగడువుగా భావించవచ్చు.
నాలుగు వార్డులకు నాలుగు...
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తొలిరోజు శుక్రవారం 6, 35, 43, 49 వార్డులకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. దీనిలో ఆరోవార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగళ్ల కోటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. 43, 49 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులుగా వేర్వేరుగా నామినేషన్లు వేశారు. 49వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా జమలాపురం కేశవరావు నామినేషన్ వేశారు. 35వ డివిజన్ నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 60 డివిజన్లకు గాను ఆరు నామినేషన్ కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 14, 15, 16, 21, 38, 40, 41, 42 వార్డులు, కార్పొరేషన్ కార్యాలయంలో 17, 27, 28, 29, 30, 31, 33, 34, 35, 36, 37, 39, ఆర్ అండ్ బీ కార్యాలయంలో 9, 10, 11, 12, 13, 18, డీఆర్డీఏ కార్యాలయంలో 43, 44, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, కో ఆపరేటివ్ కార్యాలయంలో 19, 22, 23, 25, 26, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో 20, 24, 32,45 వార్డులకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఇంకా స్పష్టత రాకపోవడంతో తొలిరోజు నామినేషన్లు కేవలం నాలుగు మాత్రమే దాఖలయ్యాయి. నేడు, రేపు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయనున్నారు. 18వ తేదీ నామినేషన్లకు చివరిరోజు...పంచమి తిథి కావడంతో మంచిరోజుగా భావించి ఎక్కువమంది ఆరోజు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్జయంతితో కలిసి శుక్రవారం సందర్శించారు. ఆర్ఓ, ఏఆర్ఓలు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులు, వారితో పాటు వచ్చే సహాయకులు, సీటింగ్ విధానం, నామినేషన్లు సమర్పించే ప్రక్రియ తదితరాలను కలెక్టర్ పరిశీలించారు. కరోనా నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల సిబ్బంది, అభ్యర్థులు, వారి వెంట వచ్చేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. శానిటైజ్ చేసుకుని, భౌతికదూరం పాటించాలని సూచించారు.
మహిళా ఓటర్లే అధికం... సగం సీట్లూ వారికే...
నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికల సంఘం కార్పొరేషన్ పరిధిలోని 50 శాతం సీట్లను మహిళలకకు కేటాయించింది. ఈమేరకు గురువారం ప్రకటించిన రిజర్వేషన్లలో 60 డివిజన్లకు 30 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళలకు మూడు, బీసీ మహిళలకు పది, 16 రిజర్వేషనేతర సీట్లు మహిళలకు కేటాయించారు. ఖమ్మం కార్పొరేషన్లో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉండటం గమనార్హం. మొత్తం 2,81,387 మంది ఓటర్లుండగా వీరిలో మహిళలు 1,45, 608 మంది, పురుషులు 1,35,734 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. పురుషులకంటే దాదాపు పది వేల వరకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్ల కోసం 376 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.