Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ ద్వారా ఏర్పాటు కాబడిన పది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అభివృద్ధి చెందాలని తద్వారా మిగిలిన రైతులు కూడా ఈ రకంగా కొత్త కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని, చుట్టుపక్కల జిల్లాల రైతులకు ఆదర్శంగా ఉండాలని కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఖమ్మం నగరంలోని (టిటిడిసి)లో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం రెండో రోజు కలెక్టర్ పాల్గొని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు, సభ్యులకు, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ పది (ఎఫ్పిఓ) కంపెనీల చట్టం లో రిజిస్ట్రేషన్ చేశారని, ఈ సంఘాల లో ఎక్కువ మంది రైతులను భాగస్వామ్యులుగా చేర్చు కోవాలని సూచించారు. రైతుల భాగస్వామ్యంతో షేర్ క్యాపిటల్ తయారు చేసుకొని వ్యాపారస్తులుగా ఎదగాలని కోరారు. అవసరమైతే వేల సంఖ్యలో రైతులను చేర్చుకోవాలని కోల్డ్ స్టోరేజ్ లను సైతం అద్దెకు తీసుకోవచ్చని, ఆ స్థాయికి సంఘాలు ఎదగాలని ఆకాంక్షించారు. నాణ్యత కలిగిన సేవలు అందించాలని, మార్కెటింగ్ పరిజ్ఞానం పెంచుకోవాలని, పండించిన పంటకు ధరను నిర్ణయించి అమ్ముకునే స్థాయికి రైతులు ఎదగాలని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే వేల సంఖ్యలో రైతులను చేర్చుకోవాలని కోల్డ్ స్టోరేజ్‌లు సైతం అద్దెకు తీసుకోవచ్చని, ఆ స్థాయికి సంఘాలు ఎదగాలని కోరారు. కామేపల్లి, సింగరేణి, మారెమ్మతల్లి, (ఖమ్మంరూరల్) కొణిజర్ల, మండల రైతులు ఉత్పత్తిదారుల సంఘాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సభ్యులు, రైతులతో కలెక్టర్ చర్చించి వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు అందజేశారు. అనంతరం ఖమ్మం జిల్లా రైతు బంధు అధ్యక్షులు, నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రైతులు పండిస్తున్న మామిడి, మిర్చి, లను రైతులు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాబు, ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి జి.అనసూయ, రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్, జిల్లా ఉద్యాన అధికారి జి.సందీప్ కుమార్, జి.నాగేష్, వేణు, రచన వెంకటేశ్వర్లు, జహీర్, విజయలక్ష్మి, పాష, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.