Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన కాటాలు
- కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతులు
- తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ
- వాతావరణ మార్పులతో అన్నదాత ఆందోళన
నవతెలంగాణ-కల్లూరు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు సరఫరా లేక గత రెండు రోజులనుండి కాటాలు నిలిచిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రబీలో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం రైతన్న బాధలు వర్ణనాతీతంగా మారాయి.
మండలాల్లో 32 వేల ఎకరాలు వరి సాగు చేసారు. రబీ సాగులో వాతావరణం అనుకూలించి రైతన్న ఆశించిన విధంగా దిగుబడి అధికంగానే ఉంది. ఎకరానికి సుమారుగా 40నుండి 50 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మండలాల్లో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీ కొనుగోలు కేంద్రాల్లో ఎటుచూసినా ధాన్యపు రాసులు కనపడుతున్నాయి. ఈ నెల 6 తేదీన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రారంభించిన ఐదు రోజుల వరకు కొనుగోళ్లు జరగలేదు. ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించారు. నిరాటంకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయని రైతులు ఆశపడ్డారు. జిల్లాలో ఆరు బాయిల్డ్ రైస్ మిల్లు ఉండగా ఒక రైస్ మిల్లును మండలానికి అలాట్ చేశారు. రోజురోజుకీ వాతావరణంలో మార్పు వస్తూ మబ్బులతో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పులుపోసుకోవటం మళ్లీ ఆరబోసుకోవటం ఈ విధంగా రైతుకి ఎనలేని శ్రమ ఖర్చుతో రైతులు అల్లాడిపోతున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు కేవలం 60 లారీలు మాత్రమే కాటాలు చేసి పంపించారు. మండలంలో సుమారు 10 నుండి 15 లక్షల బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లారీల మిల్లుకు వెళ్లిన తరవాత మిల్లు యజమానులు ధాన్యంలో తాలు ఉందని చెప్పి క్వింటాకు రెండు కేజీలు కోత పెడతారు, అట్ల ఇష్టమైతేనే ధాన్యం దింపు కొంటాము, లేకపోతే వెనక్కి పంపిస్తామని రైతులుకు ఫోన్ చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో మిల్లు యజమానులు చెప్పినదానికే తలొగ్గాల్సి పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. టిక్కీ 40 కేజీలకు 41 కేజీ కాటావేసి పంపిస్తున్నప్పటికీ ఆ విధంగా క్వింటాకు వచ్చి రెండున్నర కేజీల అదనంగా ఇస్తున్న మళ్లీ యజమానులు కోత పెట్టడంతో క్వింటాకు సుమారు ఐదు కేజీల వరకు అదనంగా పోతుందని ఈ విధంగా చేస్తే తాము బతికేదెట్లా అంటూ రైతులు వాపోతున్నారు. ఒక పక్క అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతిగింజ కొంటాం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కల్పిస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని లారీలు పంపించి గన్నీ సంచులు కొరత లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులుకోరుతున్నారు. ఈ విధంగా ఒకటీ రెండు లారీలు పంపిస్తే ధాన్యం కొనుగోలు జూన్ నెల వచ్చినప్పుడు కూడా పూర్తికావని ఈలోగా వర్షాలొస్తే జరగరాని నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు.