Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎంవి.రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
సీతమ్మ సాగర్ బహులార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు సహకరించి, ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టర్ ఎంవి.రెడ్డి రైతులను కోరారు. శనివారం సీతమ్మ సాగర్ బహులార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అశ్వాపురం మండలంలోని అమ్మగారి పల్లి, కుమ్మరి గూడెం రైతులు 152 మందితో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయానికి నీరు సమృద్ధిగా అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా సహకరించాలని కోరారు. మార్కెట్ ధరకు ప్రామాణికంగా తీసుకుని నాలుగు రెట్లు అధికంగా చెల్లిస్తామన్నారు.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తప్పని సరిగా ఈ భూములను అవార్డు ద్వారా సేకరణ చేయాల్సి ఉంటుందని ఆయను స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నిర్మించిన వివిధ ప్రాజెక్టులకు తమ నుండి భూమిని తీసుకున్నారని ఉన్న భూములను సీతమ్మ సాగర్ బహులార్ధ సాధక ప్రాజెక్టుకు తీసుకోవడం వల్ల భూములు కోల్పోతున్నామని రైతులు కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అశ్వాపురం ఇన్చార్జ్ తహసీల్దార్ భగావాన్ రెడ్డి, గిర్దావర్ తిరుపతిరావు, అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం రైతులు తదితరులు పాల్గొన్నారు.