Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌కు క్యాండెట్లను బెదిరించాల్సిన అవసరం లేదు
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం
- టిక్కెట్ కేటాయింపులో ప్రతి కులాన్ని సంతృప్తి పరిచాం..
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళ్తున్నాం: ఎంపీ నామ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు... అవాకులూ చెవాకులూ కాదు అభివృద్ధిపై మాట్లాడితే మంచిదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హితవు పలికారు. ఏ డివిజన్‌లోనూ గెలవలేని కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను బెదిరించినట్లు ఆడియో చిత్రీకరించి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని.. .దానికి తగిన సమాధానం ప్రజలే చెబుతారని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక తెలంగాణ భవన్ టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి మంత్రి మాట్లాడారు. భట్టి విక్రమార్క మధిరలో చెల్లని రూపాయి ఖమ్మంలో ఎలా చెలుద్దని భావిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, అవాకులు చెవాకులు మానుకొని అభివృద్ధిపరంగా ఏదైనా ఉంటే మాట్లాడాలన్నారు. టీఆర్ఎస్ 57, సీపీఐ 3 డివిజన్లలో కలిసి పోటీ చేస్తున్నాయని 60కి 60 వార్డుల్లో టీఆర్ఎస్, సీపీఐ కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. పోటీ చేయడానికి అభ్యర్థులే దొరక్క ఆవేదనలో ఉన్న కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వారిని బెదిరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. లేని ఆడియోని సృష్టించి తనపై నిందలు వేసి కాంగ్రెస్ లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. గెలిచాక పార్టీ మారే నాయకులను మయూరి సెంటర్లో రాళ్లతో కొట్టాలని భట్టి వ్యాఖ్యానించారు... ఆయనకు అలాంటి దిగులే అవసరం లేదు...ఏ ఒక్క డివిజన్‌లోనూ కాంగ్రెస్ పార్టీని గెలవనీయ మన్నారు. భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపల్ ఎన్నికల్లోనే చెల్లని రూపాయి...ఖమ్మం కార్పొరేషన్లో ఎలా చెల్లుతారో ఆలోచించుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం ఉంటుందన్నారు. ర్యాలీలు, డోర్ డోర్ ప్రచారం నిర్వహిస్తామన్నారు. అన్ని కులాలను సంతృప్తిపరిచేలా టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఉందన్నారు. బీసీలకు 20 సీట్లు రిజర్వ్ అయితే 30 సీట్ల వరకూ కేటాయించామన్నారు. శనివారం నుంచి అన్ని డివిజన్లలో తనతో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు
ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం నుంచి ప్రచారంలో పాల్గొంటారన్నారు. హౌంమంత్రి మహమూద్‌అలీ సైతం నేడు ఖిల్లా ఏరియా, ముస్తఫానగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారన్నారు. ఎన్నికల ప్రచారంపై నేడు సప్తపది ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు నిద్రలోనూ తాను కలలోకి వస్తున్నానని అందుకే తన పేరును నిత్యం ఆపార్టీ నాయకులు జపిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,.అభివృద్ధికే తమ ఓటు అని సంకేతాలిస్తున్నారని తెలిపారు. ఎంపీ ఎలక్షన్స్ నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అప్రతిహతంగా విజయం సాధిస్తుందన్నారు.