Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి మరింతగా ఊపు
- మాజీ ఎంపీ, మాజీ మంత్రికి సైతం బాధ్యతలు
- అధికార పార్టీ తరఫున పలువురు రంగంలోకి...
- నేడు హౌంమంత్రి మహమూద్ అలీ ప్రచారం
- స్థానిక నేతలతోనే సరిపెట్టనున్న కాంగ్రెస్
- ఖమ్మం కార్పొరేషన్ బరిలో 256 మంది
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 256 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడతాయేమోననే అనుమానానికి గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరదించింది. ఎటువంటి ఆటంకం లేకుండా ఎన్నికల నిర్వహణకు తోడ్పడుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి భరోసా ఇవ్వడంతో ఈనెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఈనేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రచారం ఒకింత ఊపందుకుంది. శనివారం నుంచి ఆయా పార్టీలు పూర్తిస్థాయిలో ప్రచారానికి సమాయత్తం అవుతున్నాయి. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఎస్ఈసీ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. పోలింగ్‌కు 72 గంటల ముందు అంటే 27వ తేదీ సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ప్రచారంలో 'కారు'జోరు...
ఎన్నికలపై అధికార టీఆర్ఎస్కు ముందు నుంచి స్పష్టత ఉండటంతో ఓ ప్రణాళికబద్ధంగా సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఐదురోజుల సమయం మాత్రమే ఉండటంతో శుక్రవారం నుంచి ప్రచార జోరు పెంచింది. శనివారం ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేసుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్హాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వారి అనుచరగణంను సైతం ఎన్నికల ప్రచారం నిమిత్తం రంగంలోకి దింపింది.
ఎవరు ఏ డివిజన్లో ప్రచారం చేయాలో ఓ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన అనుచరగణంతో ఖమ్మంలో వాలిపోయారు. నేడు హౌమంత్రి మహమూద్ అలీ సైతం ఖమ్మంలోని మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నిజాంపేట, ఖిల్లా, ముస్తఫానగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రితో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు ఓవరాల్‌గా అన్ని డివిజన్‌లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి అజరు అభ్యర్థన మేరకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం శనివారం నుంచి పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించనున్నారు.ఇప్పటికే ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, పార్టీ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్ తదితరులకు పలు డివిజన్ల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఎవరికి కేటాయించిన పనుల్లోకి వారు వెళ్లారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రచార సరళి ఎలా ఉండాలో శనివారం దిశానిర్దేశం చేయనున్నారు. ర్యాలీలు, డోర్ టు డోర్ ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచనాప్రాయంగా మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఎక్కువ మంది అవసరం ఉంటుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి కారు పార్టీ నాయకులు, చురుకైన కార్యకర్తలను సైతం రప్పించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు రాఘవ, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, మదన్‌లాల్, ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వివిధ కమిటీల చైర్మన్లు, ముఖ్య నాయకులు సైతం ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు. ఇంకా నాలుగు రోజుల వరకే ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటర్నీ కలిసేలా అధికార పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది.
చాపకింద నీరులా కాంగ్రెస్ ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ప్రచారం మాత్రం చాపకింద నీరులా సాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు బహిరంగ ర్యాలీల కంటే కూడా ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి వారు వివరణ ఇస్తూ... అధికార పార్టీ అర్థ అంగబలం ముందు తాము తులతూగలేకపోవడం ఓ కారణమైతే... వారి అధికార బలాన్ని సైతం తమపై ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నాయకులు పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రచారం చేసుకోనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం మంత్రి అజరుకుమార్ సైతం కౌంటర్ ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఇలా కారణాలేవైనప్పటికీ కాంగ్రెస్ ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది. పైస్థాయి నాయకులెవరూ ప్రచారానికి రాకపోవచ్చని తెలుస్తోంది. అభ్యర్థులు, స్థానిక నాయకులే ప్రచారం చేసుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ నాయకుల సహకారం పెద్దగా లేనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ...ముఖ్యంగా డోర్ డోర్ క్యాంపెయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొందరు అ భ్యర్థులు మాత్రం ఆటోలు, జీపులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు ర్యాలీలు తీస్తూ ప్రచారం చేస్తున్నారు.
దూసుకెళ్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు...
కాంగ్రెస్, టీడీపీలతో సీట్ల సర్దుబాటులో భాగంగా పది డివిజన్లలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అర్థబలం అంతగాలేని ఆ పార్టీ అభ్యర్థులు అంగబలంపై ఆధారపడే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా, నగర నాయకత్వం ప్రచార బాధ్యతలను తలకెత్తుకుంది. ఏ డివిజన్ బాధ్యతలు ఎవరు చూడాలో స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. దీనికి అనుగుణంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర కార్యదర్శివర్గం, కార్యవర్గ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి డోర్ డోర్ ఓటర్లను కలుస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బరిలో 251 మంది అభ్యర్థులు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 256 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎస్సీ జనరల్ 43 వార్డు నుంచి అత్యధికంగా 11 మంది పోటీలో ఉన్నారు. బీజేపీ, సీపీఐ(ఎం), సీపీఐతో పాటు 8 మంది స్వతంత్రుల పోటీ లో ఉన్నారు. ఎస్సీ జనరల్ 60వ వార్డు నుంచి ఎనిమిది మంది పోటీలో ఉన్నారు. సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో నిలిచారు. జనరల్ వార్డు 27 నుంచి ఏడుగురు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఒకటో వార్డు నుంచి అత్యధికంగా సీపీఐ(ఎం), టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం ఆరుగురు పోటీ పడుతున్నారు. ఎస్సీ జనరల్ 52, జనరల్ ఉమన్ 58 నుంచి ఆరుగురు, బీసీ జనరల్ 44 నుంచి కూడా ఆరుగురు, ఎస్టీ ఉమన్ 32 నుంచి ఆరుగురు, బీసీ జనరల్‌కు రిజర్వ్ అయిన రెండో వార్డు నుంచి ఐదుగురు, జనరల్ ఉమన్ 17వ వార్డు నుంచి, జనరల్ వార్డు 23 నుంచి, బీసీ జనరల్ 31వ వార్డు నుంచి, జనరల్ వార్డ్డ్డు 39 నుంచి, ఎస్సీ ఉమన్ 42 నుంచి, జనరల్ వార్డు 49 నుంచి, ఎస్సీ ఉమన్ 59 నుంచి ఐదుగురి చొప్పున బరిలో ఉన్నారు. మొత్తంగా 256 మంది అభ్యర్థులు 60 డివిజన్లకు పోటీ పడుతున్నారు.