Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజరు ఆధ్వర్యంలో పోలీస్ నడుస్తోంది
- బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
- అరెస్టులు ఆగపోతే ఉద్యమం తప్పదు
- విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) కలిసి 60 డివిజన్లలలో పోటీ చేసిన విషయం తెలిసిందేని, 16వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ సమయం నాటి వరకు మంత్రి పువ్వాడ అజరు కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై, నాయకులపై, కార్యకర్తలపై ఖమ్మం నగర పోలీసులు ఇష్టానుసారంగా అక్రమంగా కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి చేశాం, ప్రజలందరూ ఆశీర్వదిస్తారని, 60 స్థానాలు గెలుచుకుంటామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఓటమి భయంతోనే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా బెదిరింపులకు గురి చేయడం భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. గత రెండు రోజుల నుంచి ఈ పరిస్థితి మరి తీవ్రతరమైందని అన్నారు. స్వయంగా ఏసీపీ స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను కార్యకర్తలను చుట్టుముట్టి వెంటపడుతూ అరెస్టు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాజ్యాంగ పదవిలో లో ఉన్న మంత్రి పువ్వాడ అజరు కుమార్ అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను కార్యకర్తలను, నాయకులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 28న మధ్యాహ్నం 12గంటలకు బీసీ సెల్ నాయకుడు శెట్టి రంగారావును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం దారుణమని అన్నారు. పోలింగ్ విషయంలో రౌడీయిజం రాజ్యమేలే అవకాశం ఉందని పోలీసులు ఎన్నికల కమిషన్ తక్షణమే ఇలాంటి ఘటనకు పై సమగ్రమైన విచారణ చేసి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించే విధంగా పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. తొలుత జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్‌కు వినతి పత్రం అందజేశారు.