Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం నగరపాలక సంస్థ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం
- ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- 60 డివిజన్లలో 377 పోలింగ్ కేంద్రాలు...2,88,646 మంది ఓటర్లు
- కరోనా నిబంధనలకనుగుణంగా పోలింగ్‌కు ఏర్పాట్లు
- నిన్న రోజంతా కొనసాగిన డబ్బులు, మద్యం, చీరెలు, కిట్ల పంపిణీ
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ ఓటుహక్కును నిస్పక్షపాతంగా, నిర్భయంగా వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క ఓటరు విధిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా శానిటైజర్వినియోగించాలి. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 2,88,646 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,39,291 మంది పురుషులు, 1,49,309 మంది మహిళలు, 46 మంది ఇతర ఓటర్లున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 377 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ బాక్స్‌లతో తరలివెళ్లిన సిబ్బంది
స్థానిక ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది పోలింగ్ సామగ్రిని గురువారం సాయంత్రం ఆయా స్టేషన్లకు చేర్చారు. 2,274 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. 66 మంది రిటర్నింగ్ అధికారులు, 66 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. నగర పాలక సంస్థ ఎన్నికల పరిశీలకులు నదీమ్ అహ్మద్‌తో కలిసి కలెక్టర్ పోలింగ్ నిర్వహణకు కేటాయించిన సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేసే ప్రక్రియను పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్ మధుసూదన్ తదితరులు పోలింగ్ సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు.
1700 మందితో బందో'మస్తు'
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో 17 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 50 స్వల్ప సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల బందోబస్తుకు 9 మంది ఏసీపీలు, 14 మంది సీఐలు, 43 మంది ఎస్సైలు, 180 మంది ఏఎస్సైలు, 792 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 349 మంది మహిళా కానిస్టేబుళ్లు, హౌంగార్డులు, 104 మంది ఆర్మ్డ్ ఫోర్స్ సిబ్బందిని వినియోగిస్తారు. 65 పోలింగ్ కేంద్రాలలో వీడియో కవరేజీ, 55 కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. 75 మంది మైక్రో అబ్జర్వర్లు 258 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారు.
రోజంతా డబ్బు, మద్యం పంపిణీ
డబ్బు, మద్యం, చీరెలు, కిట్ల పంపిణీ గురువారం జోరుగా సాగింది. ఆయా డివిజన్లలో పోలీసులు మోహరించి ఉన్నా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వారి కళ్లముందే డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో విపక్షాలను ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో పోలీసులు యత్నించారు. విపక్షాలు గెలుస్తాయని భావిస్తున్న డివిజన్లలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విపక్ష అభ్యర్థులు, వారి తరఫున పనిచేస్తున్న కీలక వ్యక్తుల కదలికలపై కన్నేసి ఉంచారు. అధికార పార్టీ ఓటుకు రూ.2,000 కొన్నిచోట్ల రూ.3,000 వరకు కూడా డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని డివిజన్లలో మహిళలకు చీరెలు పంపిణీ చేశారని సమాచారం. కొన్నిచోట్ల యువకులకు క్రికెట్, వాలీబాల్, ఇతరత్ర క్రీడా కిట్లు సైతం పంపిణీ చేశారని సమాచారం. వివిధ ప్రాంతాల్లో ఉంటూ నేడు ఓటేయడానికి వచ్చే వారికి చార్జీలు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. నేడు కూడా ఈ ప్రలోభాలు కొనసాగే అవకాశం ఉంది. గుర్తుతో కూడిన ప్రింటెడ్ పోల్‌చీటీలను చూపెట్టి ఓటర్లు అధికార పార్టీ అభ్యర్థుల ఇంటికి వచ్చి మరీ డబ్బులు తీసుకెళ్లారు. కానీ విపక్షాలు డబ్బులు పంచకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్ కనుసన్నల్లోనే అధికార పార్టీ ఈ ప్రలోభాలను కొనసాగిస్తుందని, విపక్షాల అభ్యర్థులు, వారి తరఫువారిపై అక్రమ కేసులు బనాయించి స్టేషన్లలో ఉంచుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.