Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
కరోనా తన రూపం మార్చినట్లే కరోనా వ్యాక్సిన్ కోసం క్యూ రూపం ప్రజలు గురువారం మార్చారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కరోనా వ్యాక్సిన్ సరఫరా లేక వేయలేదు. దీంతో శుక్రవారం కరోనా వ్యాక్సిన్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తుందనే ఉద్దేశంతో గురువారం సాయంత్రమే శుక్రవారం వ్యాక్సిన్ కోసం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రజలు క్యూలో హ్యాండ్ బ్యాగులు, కర్రలు, ఇటుకలు, చెప్పులు, కవర్లు పెట్టారు. మండలంలో కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో కరోనా వ్యాక్సిన్ కోసం మండల ప్రజలు పెద్ద సంఖ్యలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారు. వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉండటం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో వ్యాక్సిన్ సరిపోవడం లేదు. దీంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఉదయం 5 గంటల నుంచే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ కోసం రోజు ఉదయం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జనం వచ్చేవారు కానీ శుక్రవారం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు కోసం అంతకుముందు ముందురోజే ప్రజలు క్యూలో వివిధ వస్తువులు పెట్టి వెళ్లి పోవడం విశేషం.