Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు
- ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజీలో ఏర్పాట్లు
- కరోనా నెగిటివ్ ఉన్నవారికే అనుమతి
- ఖమ్మంలో రేపు ఉదయం వరకు 144 సెక్షన్
- కరోనా నేపథ్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు నిషిద్ధం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం స్థానిక ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం నగరంలో 60 డివిజన్లు ఉండగా ఒక డివిజన్ (10వ వార్డు) ఏకగ్రీవమైంది. మిగిలిన 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ పరిధిలో 2,83,302 ఓట్లుండగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 1,62,404 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 59.80 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది, అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టెస్టులు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కరోనా లేదనే ధ్రువీకరణ పత్రం చూయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆదివారం ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాలలో టెస్టులు చేశారు. అలాగే సమీపంలోని ఆస్పత్రిలో టెస్టు చేయించుకుని నెగిటివ్ వచ్చిన వారిని కూడా కేంద్రంలోకి అనుమతిస్తారు.
150 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు
ఈ ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరికి నమోదైన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 150 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో పది డివిజన్ల చొప్పున ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్ ఓట్ల లెక్కింపునకు మూడు టేబుళ్లు కేటాయించారు. జోనల్ ఆఫీసర్లను స్ట్రాంగ్ రూం ఇన్చార్జిలుగా నియమించారు. పది హాల్స్‌లో పదిమంది రోఇన్చార్జిలు వారే డ్రమ్ అండ్ హౌల్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఆర్వో, ఏఆర్వో, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. రిటర్నింగ్ అధికారి హాల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. ప్రతీ హాల్‌కు ఓ మైక్రో అబ్జర్వర్ (ఎంవో) ఉంటారు. హాల్లో పది సీసీ కెమెరాలతో పాటు ఓ వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి గతనెల 28న, తిరిగి ఆదివారం రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. ప్రతి డివిజన్ ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, సిబ్బంది, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారు నియమించిన ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌ను ఓపెన్ చేస్తారు. 25 బ్యాలెట్ పేపర్లను ఓ కట్టగా కడతారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల లోపు ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతిలేదని ప్రకటించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కౌంటింగ్ హాళ్లను సందర్శించిన కలెక్టర్
ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదివారం సందర్శించారు. టేబుళ్ల అమరిక, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లను పూర్తిగా శానిటైజ్ చేశారా? అని ప్రశ్నించారు. తాగునీరు, షామియానాలు, విద్యుత్ అంతరాయం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్అండ్బీ సూపరిం టెండెంట్ ఇంజనీర్ పి.లక్ష్మణ్, నగరపాలక సంస్థ ఎస్ఈ ఆంజనేయప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గెలుపుపై ధీమాతో టీఆర్ఎస్
ఈ ఎన్నికల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. సీపీఐ మద్దతుతో పోటీ చేసిన ఆ పార్టీ మొత్తం 57 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. మూడు వార్డులు సీపీఐకి కేటాయించింది. కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కాంగ్రెస్ 47 డివిజన్లలో, సీపీఐ(ఎం) పది వార్డుల్లో పోటీ చేసింది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థుల (14, 37 వార్డులు)కు మద్దతు ఇచ్చింది. టీడీపీ 8 డివిజన్లలో పోటీ చేసింది. బీజేపీ 47, జనసేన ఐదు డివిజన్లలో మిత్రపక్షంగా ఉన్నాయి. వీరుకాక మరో 70 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 60 డివిజన్లకు గాను మొత్తం 372 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా 60వ డివిజన్ 372వ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 94.57 శాతం ఓట్లు పోలయ్యాయి. పలు డివిజన్లలో 30శాతం లోపు పోలింగ్ నమోదైంది. 20, 37, 41, 51, 52 డివిజన్లలో అతితక్కువ ఓట్లు నమోదయ్యాయి. ఇదిలావుంటే అధికార టీఆర్ఎస్ 60కి 60 స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నా... 45కు పైగా స్థానాలు ఆ పార్టీకి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్-సీపీఐ(ఎం), టీడీపీలకు కలిపి 15 నుంచి 20 స్థానాలు దక్కించుకుంటాయని లెక్కలేస్తు న్నారు. 2016లో తొలిసారి కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులకు గాను టీఆర్ఎస్ 34, కాంగ్రెస్ 10, సీపీఐ(ఎం), సీపీఐ, వైఎస్ఆర్సీపీ రెండేసి వార్డులు దక్కించుకున్నాయి. ఈసారి వైఎస్ఆర్సీపీ పోటీలో లేదు. మరీ ఈసారి ఎవరెన్ని స్థానాల్లో విజయం సాధిస్తారో...! ఖమ్మం కార్పొ రేషన్ పీఠం ఎవరిదో నేటితో స్పష్టమవుతుంది.