Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలియో బాధితుడైనా సేవలో మిన్న
- ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చేయూతతో వితరణ
- కరోనా బాధితులకు బాసట..
- మెడిసిన్ సరఫరా
- ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు...
సహాయ సహకారాలు
అ ఎన్ఆర్ఐ ఫౌండేషన్‌తోనే నాకీ గుర్తింపు అంటున్న సెక్రటరీ బండి నాగేశ్వరరావుతో 'నవతెలంగాణ' ముఖాముఖి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రెండేళ్ల ప్రాయంలో ఆయన పోలియో బారిన పడ్డారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎంఎస్సీ, ఎంఎడ్ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడ్డారు. చిన్ననాటి నుంచి సర్వీస్ మోటో ఉన్న ఆయనకు 2016లో ఎన్ఆర్ఐ ఫౌండేషన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆయనలోని సేవాతత్పరతకు తోడ్పాటైంది. ఆ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ...తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ సెక్రటరీ, ఖమ్మంలోని మంజీర అపార్ట్మెంట్ బాధ్యులు బండి నాగేశ్వరరావుతో 'నవతెలంగాణ' ముఖాముఖి.
- పుట్టుక, విద్యాభ్యాసం, కుటుంబం...
కల్లూరు మండల కేంద్రంలో 1975లో జన్మించాను. మా తల్లిదండ్రులు బండి రాఘవయ్య, సరస్వతి స్థానికంగా ఓ హౌటల్ నిర్వహిస్తూ నన్ను, అన్నయ్య, అక్కను పోషించారు. నా రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాను. కల్లూరులో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. డిగ్రీ సత్తుపల్లిలో పూర్తి చేశాను. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, బీఎడ్, ఎంఎడ్లు పూర్తి చేశాను. 2002లో ఎస్జీటీ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందాను. ఆ తర్వాత రజినీతో నా వివాహం అయింది. మాకు జోషిత, సాహితీ ప్రియ అనే ఇద్దరు పిల్లలు. చిన్ననాటి నుంచి సేవా గుణం ఉన్న నాకు పెళ్లయ్యాక భార్య రజిని ప్రోత్సాహం కూడా తోడైంది. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆమె కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది.
- చిన్ననాటి నుంచే నాది సేవాగుణం...
చిన్నప్పటి నుంచే నాకు సేవా గుణాలు అబ్బాయి. 2006 వరకు కల్లూరు మండల చుట్టుపక్కల గ్రామాల యువకులను ప్రోత్సహించి మూడువేల యూనిట్ల రక్తదానం చేయించాను. నేనూ వ్యక్తిగతంగా తొమ్మిదిసార్లు రక్తదానం చేశాను. 2016లో ఎన్ఆర్ఐ ఫౌండేషన్‌తో నాకు పరిచయమైనప్పటి నుంచి మరింతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. దాని సెక్రటరీగా కొనసాగుతున్నా. ఇంకా చేతన ఫౌండేషన్, గురుదక్షిణ, తానా, ప్యూర్ ఆర్గనైజేషన్, సామినేని ఫౌండేషన్, ఆశ్రి సొసైటీ మొదలైన సంస్థలన్నింటితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గంటున్నాను.
- నేను సెక్రటరీగా ఉన్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్‌తో...
ఎన్ఆర్ఐ ఫౌండేషన్‌తో నాకు 2016లో పరిచయం ఏర్పడింది. ఈ ఫౌండేషన్‌లో రెండు వింగ్స్ ఉంటాయి. అందులో ఒకటి విదేశాల్లో ఉండి సేవా కార్యక్రమాలకు ఆర్థిక తోడ్పాటునందిస్తుంది. స్థానికంగా ఉండే వింగ్ ఆ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. బయ్యన బాబురావు, దొడ్డపనేని హరినాథబాబు, జయశేఖర్ తాళ్లూరి, రాధాకృష్ణ ఆళ్ల కోర్ కమిటీ మెంబర్స్ విదేశాల్లో ఉంటారు. స్థానికంగా నేను, బోనాల రామకృష్ణ, పసుమర్తి రంగారావు, కృష్ణారావు, అర్జున్‌రావు, శ్రీదేవి, రాజేశ్వరి తదితరులు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాం. మా స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ, శ్రీనివాస్, శివరామకృష్ణ కూడా మాకు ఎంతో సపోర్టుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మొత్తం 1500 మందికి పైగా ఎన్ఆర్ఐలు ఈ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్నారు.
- కోవిడ్ బాధితుల కోసం....
కోవిడ్ బాధితుల కోసం గతేడాది నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం లాక్డౌన్ నేపథ్యంలో వేలాది మందికి రూ.50లక్షల విలువైన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశాం. ఈ ఏడాది కోవిడ్ కమ్యూనిటీలోకి వచ్చేసిన నేపథ్యంలో పంథా మార్చాం. ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, మెడిసిన్, ఆక్సీజన్, మాస్కులు, శానిటైజర్, ఫుడ్ వంటివి పంపిణీ చేయాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా బుధవారం బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి అండదండగా నిలుస్తున్నాం. కోవిడ్ బాధితుల కోసం యూఎస్ఏ నుంచి 20వేల ఎన్95 మాస్కులు, 20 (10లీటర్లు) ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, 2000 పీపీఈ కిట్లు, పల్సీ ఆక్సీ మీటర్లు, బీపీ ఆపరేటర్లు, మెడికల్ కిట్లు తెప్పించి పంపిణీ చేస్తున్నాం. అమెరికా డాక్టర్ల బృందం ఇక్కడి డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతుంది. పేషెంట్లకు మనోస్థైర్యం కల్పిస్తుంది. ఇందుకు ఐసోలేషన్ కేంద్రంలో రెండు టీవీలు సైతం ఏర్పాటు చేశాం. వాటిని మొబైల్‌తో అనుసంధానించి పేషెంట్లతో మాట్లాడిస్తున్నాం. తానా, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మరో వారం రోజుల్లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం.
గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో కొన్ని...
ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో వికలాంగులకు మూడు చక్రాల బండ్లు, 500 మందికి జైపూర్ లెగ్స్ పంపిణీ చేశాం. సుమారు 1500 పాఠశాలలకు టీవీలు సమకూర్చాం. పరీక్షల సమయంలో గంపా నాగేశ్వరరావు వంటి మానసిక నిపుణులతో విద్యార్థులకు మోటివేషన్ (ప్రేరణ) క్లాసెస్ నిర్వహించాం. కౌమార దశలో ఉన్న విద్యార్థినులకు నాపికిన్స్ పంపిణీ చేశాం. మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్య నా స్నేహితురాలు కావడంతో రూ.1.50 కోట్లు వెచ్చించి నాప్కిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఆ తర్వాతే ప్రభుత్వం ఈ కార్యక్ర మాన్ని చేపట్టింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాను. స్వచ్ఛంద సంస్థలెన్నింటిలోనూ భాగస్వామై సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా.
వైకల్యం గురించి....
సంకల్పం గొప్పదైనప్పుడు వైకల్యం ఏమీ చేయలేదని నా భావన. అదే ఆచరిస్తున్నాను. సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నాను. వైకల్యం అనేది శరీరానికి సంబం ధించిందే కానీ మనసుకు సంబంధించి కాదని నా ఉద్దేశం.