Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు నష్టం జరిగింది. మండలంలో అనేక గ్రామాలలో అన్నదాతలు మొక్కజొన్న, ధాన్యం, మిర్చి కల్లాల్లో పోసుకున్నారు. మండల వ్యాప్తంగా అన్నదాతలు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా తమ పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు కల్లాల వద్దకు పరుగులు తీశారు. మొక్కజొన్న, ధాన్యం పంటలపై పట్టాలు కప్పారు. వర్షం ఒక మోస్తరుగా పెద్దది కావడంతో తెల్లవారేసరికి పట్టాలలోకి సైతం వర్షపు నీరు చేరింది. దీంతో మిర్చి, ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం వల్ల తడిసి పోవటంతో అన్నదాతలకు నష్టం జరిగింది. తడిసిన పంటను కొనుగోలు చేస్తారో లేదో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్న పంట ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుందని, ప్రస్తుతం అకాల వర్షం వల్ల తడిసిన మొక్కజొన్న పంటను మరింత కారుచౌకగా ప్రైవేటు వ్యాపారులు అడుగుతారేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ విధానాలతో ప్రకృతి వైపరీత్యాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు నిరాశ నిస్పహలతో కొట్టుమిట్టాడుతున్నారు. తడిచిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.