Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు లాక్డౌన్ సక్సెస్
- 10 గంటల తర్వాత నిర్మానుష్యం
- రోడ్లపై స్వల్పంగా తిరిగిన వాహనాలు
- ఖమ్మంలో కోవిడ్ టెస్టులకు ఇబ్బంది
- నేటి నుంచి మరింత పకడ్బందీగా లాక్డౌన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పదిరోజుల లాక్డౌన్లో భాగంగా తొలిరోజు బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వం మూతబడ్డాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజా కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతో ఆలోగా పనులు ముగించుకోవడంలో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్డౌన్ తొలిరోజు కావడం...అది కూడా మంగళవారం సాయంత్రం ప్రకటన వెలువడటంతో దూరప్రయాణాలు చేసేవారు...దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కట్లకు గురికావాల్సి వచ్చింది. మొదటిరోజు కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా ఒకింత ఉదాసీనత కనబరిచింది. ఫలితంగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అక్కడక్కడ కొంత జన సంచారం కనిపించింది. ఖమ్మం జిల్లా పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ నగరంలో లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు. గురువారం నుంచి మరింత పకడ్బందీగా అమలు చేయా లని ట్రాఫిక్, ఇతర పోలీసు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. పలుచోట్ల షాపింగ్ మాల్స్‌ను తెరవలేదు. బ్యాం కులు బుధవారం యథాసమయం ప్రకారం నడిచాయి. కానీ గురువారం నుంచి ఉదయం 8 గంటలకు మొదలై 12 గంటల వరకే బ్యాంకులు కొనసాగుతాయని లీడ్‌బ్యాంక్ మేనేజర్ సీహెచ్ చంద్రశేఖరరావు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం మంది ఉద్యోగులు విధులు నిర్వహించారు.
నాలుగు గంటల పరిమితితో ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం
లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు గంటల పరిమితితో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో నిర్ణీత సమయంలో బుధవారం మొత్తం 52 బస్సులను నడిపారు. గురువారం నుంచి 74 బస్సు సర్వీసులను ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, నాలుగు గంటల వ్యవధిలో ప్రయాణం ముగించేలా సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సాల్మన్‌రాజ్ తెలిపారు. సూర్యాపేటకు 4, కోదాడ 4, ఇల్లెందు 4, ఖమ్మం లోకల్ 5, తొర్రూరు 2, బోనకల్ 2 చొప్పున పల్లెవెలుగు బస్సులు, హైదరాబాద్ 1, సత్తుపల్లి, హన్మకొండ, కొత్తగూడెంలకు రెండేసీ చొప్పున ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తాయని మొత్తంగా ఖమ్మం నుంచి 28 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. మధిర డిపో పరిధిలోని ఆయా ప్రాంతాలకు 8, సత్తుపల్లి డిపో పరిధిలో 8, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల పరిధిలో పదేసి చొప్పున సర్వీసులు నడుస్తాయని వివరించారు.
ఆకస్మిక ప్రకటనతో అష్టకష్టాలు
ఆకస్మికంగా లాక్డౌన్ ప్రకటన వెలవడటంతో మంగళవారం రాత్రి హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. హైదరా బాద్ నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు రావాల్సిన ప్రయాణీకులకు కూడా ఇలాగే ఇబ్బందులు ఎదుర య్యాయి. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటామో... లేదోనన్న ఆందోళనతో రూ.500 వరకు అదనపు చార్జీలు వెచ్చించి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసుల్లో వెళ్లాల్సిన వారు రూ.200 వరకు అదనంగా వెచ్చించి గరుడ, రాజధాని సర్వీసుల్లో ప్రయాణం చేశారు. శుభ కార్యాల కోసం షాపింగ్‌కు పట్టణాలకు వచ్చిన వారిది కూడా ఇదే పరిస్థితి.
- నిలిచిన వ్యాపార లావాదేవీలు
లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలు నిలిచాయి. పదిరోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. బ్యాంకులు తెరిచినా పెద్దగా లావాదేవీలు కొనసాగలేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు లాక్‌డౌన్‌కు ముందే 16వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు, ఉపాధి హామీ పథకం పనులు కొనసాగినా...స్తబ్దత కనిపించింది. ఉదయం 10 గంటల లోపు ఒకటి, రెండు గంటలు షాపింగ్‌మాల్స్ కొనసాగు తున్నాయి. కానీ కొనుగోళ్లు లేకపోవడంతో వెంటనే షట్టర్లు క్లోజ్ చేశారు. నిత్యావసరాలు, మెడికల్ షాపులు కొనసాగుతున్నా జన సంచారం లేకపోవడంతో అవి కూడా వెలవెలబోయాయి. మద్యం ప్రియులు మాత్రం ఉదయాన్నే కొనుగోళ్లు జరిపారు.
- కోవిడ్ పరీక్షల సమయంపై సందిగ్ధత
కోవిడ్ పరీక్షల సమయం విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే లాక్డౌన్ నుంచి వెసులుబాటు ఇవ్వడంతో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల వద్ద బారులు తీరి ఉంటున్న జనం పరిస్థితి అయోమయంగా మారింది. బుధవారం ఖమ్మం పాతబస్టాండ్, నయాబజార్ సెంటర్లో 10 గంటలు దాటిన తర్వాత కూడా జనం బారులు తీరి ఉన్నారు. కోవిడ్ సెంటర్ నిర్వాహకులు ఉదయం 9.30 గంటలకు కేంద్రాలను తెరుస్తున్నారు. వాళ్లు పని ప్రారంభించే సరికి ఉదయం 10.30 గంటలు అవుతుంది. అప్పటికే లైన్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మందులు తీసుకోవాల్సి ఉంటుంది. లాక్డౌన్ నిబంధనలు ఈ పరీక్షలకు ఆటంకం కాకుండా చూడాలని కోవిడ్ బాధితులు కోరుతున్నారు.
నేటి నుంచి కరోనా, లాక్డౌన్ పరిస్థితులపై మంత్రి సమీక్ష
కరోనా, లాక్డౌన్ పరిస్థితులపై మంత్రి పువ్వాడ అజరుకుమార్ అధికారులతో గురువారం సమీక్షిస్తారు. కేబినెట్ ఆదేశాల మేరకు మంత్రి అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్‌వో, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేస్తారు. కరోనా, లాక్డౌన్ పరిస్థితులపై మంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు ఈ హైపవర్ కమిటీ సమావేశం అవుతుంది. మెడిసిన్, ఆక్సీజన్, బెడ్స్ సౌకర్యం, వ్యాక్సినేషన్, లాక్డౌన్ అమలుతీరుపై చర్చిస్తుంది.