Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేపల వ్యాపారి ఇష్టారాజ్యం
- చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ-బోనకల్
రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తే ఇందుకు విరుద్ధంగా ఓ చేపల వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటన మండల పరిధిలోని రావినూతల లోని చెరువు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రావినూతల గ్రామం లోని ఊర చెరువులో గత 15 రోజుల క్రితం చేపల వ్యాపారి మరస కట్ల సంజీవ రావు కరోనా నిబంధనలకు విరుద్ధంగా చేపల పట్టడమే కాక చేపలు పట్టేందుకు క్రిమిసంహారక మందులు చెరువులో చల్లి చేపలు పట్టాడు. దీంతో పెద్ద ఎత్తున చేపలు మత్యువాత పడ్డాయి. ఈ విషయం తెలిసిన మత్స్యశాఖ ఏడి చేపల చెరువు వ్యాపారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వైపు కరోనా తీవ్రరూపం దాలుస్తోంది, తమ అనుమతి లేకుండా చేపలు ఎందుకు పడుతున్నావు అని తీవ్రంగా మందలిస్తూ తమ అనుమతి లేకుండా చేపలు పట్ట వద్దని ఆదేశించారు. దీంతో చేపలు పట్టడం నిలిపివేశాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజే నిబంధనలకు విరుద్ధంగా చెరువులో మంగళవారం పెద్ద ఎత్తున చేపల వ్యాపారం చేపట్టాడు. దీంతో రావినూతల గ్రామస్థులతో పాటు రావినూతల చుట్టుప్రక్కల గ్రామాల నుంచి చేపల కోసం జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చెరువు వద్ద జనం గుంపులు గుంపులుగా చేరటంతో ఓ జాతర్ల తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని పోలీసు శాఖను, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఒకవైపు మండల కేంద్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా, సంపూర్ణంగా అమలు జరుగుతుండగా మరొకవైపు చేపల వ్యాపారి మాత్రం చేపల వ్యాపారం పనిలో ఉన్నాడు. చేపల కోసం జనం ఎగబడ్డారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ గుంపులుగుంపులుగా ఉండటానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ చేపల వ్యాపారి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అయినా అధికారులు ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘించి చెరువులో చేపలు పడుతున్న సంజీవరావు పట్ల మండల అధికారులు మౌనంగా ఉండటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతూ ఉండగా వ్యాపారి మాత్రం ఆ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పట్ల గ్రామంలోని కొంత మంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందువల్ల ఎవరు గుంపులుగా ఉండవద్దని గ్రామాల్లో ప్రచారం చేస్తున్న గ్రామపంచాయతీ పాలకవర్గం ,మండల అధికారులు చెరువు వద్ద జనం గుంపులు గుంపులుగా ఉంటే ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చేపల వ్యాపారి పట్ల మండల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల మండల ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి ఎటువంటి అనుమతులు లేకుండా చెరువులో చేపలు పడుతున్న చేపల వ్యాపారి పై లాక్ డౌన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.