Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడ బస్సులు అక్కడే ...
నవతెలంగాణ-భద్రాచలం
నాలుగు రాష్ట్రాల ముఖ్య కూడలిగా ఉన్న భద్రాచల ప్రాంతం లాక్ డౌన్‌తో బుధవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించడంతో తొలి రోజు బుధవారం భద్రాచలంలో లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వ్యాపారవర్గాలు, వాణిజ్య వ్యాపార సంస్థలు లాక్ డౌన్ పాటించటంతో ఎప్పుడూ రద్దీగా ఉండే భద్రాచలంలోని యూబీ రోడ్డు, మార్కెట్ రోడ్డు, ఇతర ప్రాంతాలు వెలవెలబోయాయి. నిత్యం రద్దీగా ఉండే అంబేద్కర్ సెంటర్ జన సంచారం లేక నిర్మానుష్య ప్రాంతంగా మారింది. ఇదే సమయంలో భద్రాచలంలోనే ఆర్టీసీ ప్రాంగణంలోని డిపో ప్రాంతం వెలవెలబోయింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొన్ని బస్ సర్వీసులు నడిచాయి. 10 తరువాత ఎక్కడ బస్సులు అక్కడే నిలిచాయి. భద్రాచలం ఏఎస్పి డాక్టర్ జి.వినీత్ నేతృత్వంలోపట్టణ సీఐ టి.స్వామి ఆధ్వర్యంలో భద్రాద్రి పోలీసులు లాక్ డౌన్ పాటించేలా బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
రామాలయ ప్రాంతం వెలవెల ..
నిత్యం భక్తులతో, పర్యాటకులతో రద్దీగా కనిపించే భద్రాచలంలో ఉన్న రామాలయం పరిసర ప్రాంతాలు లాక్ డౌన్ తో బుధవారం వెలవెలబోయాయి. అదేవిధంగా భక్తుల దర్శనాలకు అనుమతి రద్దు చేయటంతో ,అంతర్గత సేవలను రామాలయంలో కొనసాగించారు. ఈ మేరకు మధ్యాహ్న కాల సమయంలో రామాలయ తలుపులను దేవస్థానం అధికారులు, సిబ్బంది మూసివేశారు.
అన్నపురెడ్డిపల్లి : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నియమాలు పాటిస్తూ ఉదయం 10 గంటలు నుండి ఎవరు బయటకు రాకుండా వున్నారు. దీనితో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా వున్నాయి. ప్రతీ గ్రామంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితితులు గమనిస్తూ రోడ్లపైకి ప్రజలను రానివ్వకుండా తగిన సూచనలు అవగహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా జిల్లా సరిహద్దు బూర్గుగూడెం దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పరిశీలించారు.
టేకులపల్లిలో లాక్ డౌన్ కఠినంగా అమలు
టేకులపల్లి : టేకుల పల్లిలో స్థానిక సీఐ, ఎస్ఐ. బానోత్. రాజు, ఇమ్మడి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం లాక్డౌన్ కఠినంగా అమలు చేశారు. లాక్‌డౌన్‌ను ఇల్లందు డి.ఎస్.పి. పి రవీందర్‌రెడ్డి పరిశీలించారు.
చండ్రుగొండ : మండల వ్యాప్తంగా ప్రజలు లాక్ డౌన్ నియమాలను పాటించారు. దీంతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలు ఉదయం 10 గంటల తర్వాత నిర్మానుష్యంగా మారాయి. లాక్ డౌన్ ప్రక్రియ అమల్లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ బి రాజేష్ కుమార్ పోలీస్ సిబ్బందితో లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. అలాగే వాహనాలపై తిరుగుతున్న యువతను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ నామమాత్రమే
మణుగూరు : రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 20 గంటల లాక్డౌన్ విధించింది. బుధవారం ఆకస్మాతుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటించిన పట్టణ ప్రాంతంలో వ్యాపారస్తులు, ఇతరులు స్వయంగానే లాక్డౌన్ విధించుకున్నారు. ఉదయం పది గంటల లోపే ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. ఏఎస్పి డాక్టర్ శభారీష్ ఆధ్వర్యంలో సిఐ భానుప్రకాష్, ఎస్ఐలు బట్టా పురుషోత్తం, నరేష్‌లు ఇతర సిబ్బందితో కలిసి భారీగ మోహరించడంతో ప్రజలు ముందే అప్రమత్తమయ్యారు. కానీ మండలంలోని 14 గ్రామపంచాయతీలలో ప్రజలు ఆంతగా స్పందించలేదు. మణుగూరు ఆర్టిసి ఉదయం 10గంటల లోపు భద్రాచలం, కొత్తగూడెం ఏరియాలకు సర్వీలను నడిపింది. 13 గంటల వరకు డ్రైవర్లు, సిబ్బంది ఆందుబాటులో వుండాలని లేకపోతే చర్యలు తప్పవని ఎస్టిఐ హుస్సేన్ ఆదేశించడంతో అక్కడే ఉన్నారు. పాజిటివ్ వున్న కుమారుడితో కెవి.రావు కండక్టర్ డిపో ఆవరణంలో బైక్ స్కిడ్ అయి పడడంతో తీవ్రగాలయ్యాయి. దీంతో ఇతర సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం అందరూ ఇండ్లకి వెళ్లాలని డిఎం చెప్పడంతో వాహనాలు లేక ఆర్టిసి సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు.