Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో తనదైన ముద్ర వేస్తున్న
తహసీల్దార్
- ఇసుక అక్రమ రవాణాను 100శాతం
అదుపు చేసిన చేసిన అధికారి
- ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన
చర్యలకు వెనుకాడని నైజం
నవతెలంగాణ-పినపాక
మండల తహసీల్దార్ కార్యాలయం అంటేనే చాలామందికి భయం అవినీతి పుట్ట అని. అటువంటి భావన పేరుకుపోయిన ప్రజల్లో నిండుకున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ బాధ్యతలు తీసుకున్న నిమిషం నుండి తనదైన మార్కు వేస్తూ అక్రమార్కుల గుండెల్లో పట్టువదలని విక్రమార్కు డిలా తయారయ్యారు పినపాక తహసీల్దార్ విక్రమ్ కుమార్. బాధ్యత తీసుకున్న మొదటి రోజు నుంచే మండలంలో పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. గతంలో ఇసుకపై ఎన్ని వార్తలు వచ్చినా అరికట్టలేని రెవెన్యూ యంత్రాంగం నూతన తహసీల్దార్ రాకతో ఇసుక అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్లను, ఓనర్లను సైతం పిలుస్తూ మన వాహనం-మన ఇసుకపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అయితే అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. దళితులు, గిరిజన గ్రామాల్లో నెలకు రెండుసార్లు పర్యటిస్తూ ఆ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇంతవరకూ ఏ తహసీల్దార్ కూడా దళిత గిరిజన గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. ప్రజా సమస్యలు రావడానికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సైతం గ్రామాల్లోకి రావడం పేద ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి అధికారులు ప్రతి చోట ఉంటే రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఉందంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.