Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ లో బాధితుడు ఫిర్యాదు
- విచారణకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ
- మాట మార్చిన బాధితుడు
నవతెలంగాణ-మధిర
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దీనిని ఆసరాగా తీసుకుని కొంత మంది ప్రయివేటు వైద్యశాలల యజమానులు బాధితుల నుంచి అందినకాడికి దోచుకుంటూ ఆ కుటుంబాలను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన యస్. సాయిజ్యోతి (24)కి కరోనా పాజిటీవ్ వచ్చింది. చికిత్స నిమిత్తం మధిర పట్టణంలోని కేవీఆర్ జనరల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం ఇన్ పేషెంట్‌గా చేరారు. రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఆరు అత్యవసరంగా అందించాలని వైద్యులు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆసుపత్రి నిర్వాహకులు ఒక్కో ఇంజక్షన్ గాను రూ.30 వేలు వసూలు చేసినట్లు బాధితురాలికి సంబంధించిన ఉమేష్ అనే వ్యక్తి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ వేదికగా ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన కేటీఆర్ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. మధిర తహసీల్దార్ సైదులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు ఉమేష్ మీడియాతో మాట్లాడుతూ రెమిడిసివర్ ఇంజెక్షన్లు హైదరాబాద్ నుంచి తెప్పించుకొని డాక్టర్ రాంబాబుతో ట్రీట్మెంట్ చేయించుకున్నానన్నారు. డిశ్చార్జి అయ్యాక మెడికల్ క్లైమ్ కోసం బిల్లులు అడగగా రెండు సార్లు తిప్పించుకున్నారని నిర్లక్ష్యంగా ప్రవర్తించారనే కోపంతోనే వారిపై కేటీఆర్‌కు తప్పుగా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న మధిర ప్రజానీకం, పలు పార్టీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ సంఘాలు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఉమేష్‌పై సుమోటో కేసు నమోదు చేయ్యాలని మధిర పోలీసులను కోరారు.