Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- బోనకల్
మధిర సర్కిల్ పరిధిలో ప్రజల శ్రేయస్సు కోసమే లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని మధిర సిఐ ఒడ్డేపల్లి మురళి తెలిపారు. బోనకల్ లోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్ట్ ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చే వాహనాల సమాచారాన్ని నమోదు చేసే రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది అంబులెన్స్ ద్వారా కోవిడ్ బాధితులను తీసుకొని వస్తే తనిఖీలలో దొరికిపోతామని కొంతమంది తెలివిగా కార్లలో తీసుకొని వస్తున్నారని, అటువంటి వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర పనులపై వచ్చే వారిని మాత్రమే అనుమతించాలన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్డుపై సంచరించ రాదని, దానివలన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే చర్యలు తప్పవన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గత నాలుగు రోజులుగా కరోనా కట్టడికై మధిర సర్కిల్ పరిధిలోని పోలీసులు సిబ్బంది 24 గంటలు పాటు కరోనా కట్టడికై కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్సై బలుగూరి కొండలరావు, సిబ్బంది ఎక్కిరాల కృష్ణ, జి.వెంకట నారాయణ, సత్యంబాబు, కృష్ణయ్య, శివకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.